కడపలోని జిల్లా కేంద్రం కారాగారంలో ఓ ఖైదీ వద్ద సెల్ఫోన్లు లభ్యం కావడంపై విచారణకు ఆదేశించించామని.. వారం రోజులపాటు డీఐజీ రవి కిరణ్ విచారణ చేపట్టినట్లు జైళ్ల శాఖ డీజీ అంజనీ కుమార్ తెలిపారు. ఏడుగురు జైలు సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని ఆయన వెల్లడించారు.
ఇటీవల పీడీ యాక్ట్ కింద అరెస్టయి కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తి నుంచి 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివరాలను డీజీ వెల్లడించారు. “మంగళవారం మరోసారి జైలు అధికారులను స్వయంగా ఆరా తీశా.
మున్ముందు జైల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని జైలు అధికారులు ప్రమాణం చేశారు. జైలు సిబ్బందిపై నాకు నమ్మకముంది. కడప మహిళా కారాగారంలో వృత్తి, నైపుణ్య కోర్సులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
మదనపల్లి సత్సంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు జైళ్లలో యోగా కోర్సులు నిర్వహిస్తాం. రానున్న ఆరు నెలల్లో ప్రతి జైలు నుంచి 15 నుంచి 20 మంది ఖైదీలను యోగా శిక్షకులుగా తయారు చేస్తాం. ఖైదీల్లో పరివర్తన తీసుకురావడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం” అని డీజీ అంజనీ కుమార్ వెల్లడించారు.