భారతదేశంలో ప్రయాణికుల విమానాల తయారీకి మళ్లీ నాంది పలుకుతూ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) భారీ ముందడుగు వేసింది. ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమానికి ఊతమిస్తూ, రష్యాకు చెందిన పబ్లిక్ జాయింట్ స్టాక్ కంపెనీ యునైటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ (పీజేఎస్‌సీ–యూఏసీ)తో కీలక అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, ఎస్‌జే–100 (SJ–100) సివిల్ కమ్యూటర్ విమానాలను భారత్‌లో తయారు చేయనున్నారు. మంగళవారం రష్యా రాజధాని మాస్కోలో ఈ చారిత్రక ఒప్పందంపై సంతకాలు జరిగాయి.
ఈ కార్యక్రమానికి హెచ్ఏఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డీకే సునీల్, యూఏసీ డైరెక్టర్ జనరల్ వాదిమ్ బదేకా హాజరయ్యారు. వారి సమక్షంలో హెచ్ఏఎల్ తరఫున ప్రభాత్ రంజన్, యూఏసీ తరఫున ఒలేగ్ బొగోమొలోవ్ ఎంఓయూపై సంతకాలు చేశారు. మూడు దశాబ్దాల విరామం తర్వాత దేశంలో మళ్లీ ప్రయాణికుల విమానాల తయారీకి శ్రీకారం చుట్టడం విశేషం. ఈ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి సాంకేతిక సహకారంతో దేశీయ పరిశ్రమలకు కొత్త శక్తిని అందిస్తుందని హెచ్ఏఎల్ ప్రకటించింది.
ఎస్‌జే–100 అనేది రెండు ఇంజిన్లతో నడిచే నారో–బాడీ విమానం. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 16 కమర్షియల్ ఎయిర్‌లైన్స్ 200కు పైగా ఎస్‌జే–100 విమానాలను విజయవంతంగా నడుపుతున్నాయి. ఈ ఒప్పందం కింద హెచ్ఏఎల్ భారతదేశంలో ఈ విమానాలను తయారు చేసే హక్కులు పొందుతుంది. ముఖ్యంగా, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “ఉడాన్ పథకం” కింద దేశీయ కనెక్టివిటీని పెంపొందించడంలో ఈ ప్రాజెక్ట్ కీలకపాత్ర పోషించనుంది. ప్రాంతీయ విమాన సర్వీసుల విస్తరణకు ఈ ఎస్‌జే–100 విమానాలు గేమ్ ఛేంజర్‌గా నిలుస్తాయని కంపెనీ విశ్వాసం వ్యక్తం చేసింది.
గతంలో హెచ్ఏఎల్ 1961 నుంచి 1988 వరకు ఆవ్రో హెచ్‌ఎస్–748 (AVRO HS–748) ప్రయాణికుల విమానాలను తయారు చేసింది. ఆ తర్వాత మూడు దశాబ్దాల పాటు ఈ రంగం నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ అదే ఘనతను సొంతం చేసుకునేందుకు ఈ కొత్త ప్రాజెక్ట్ ముందుకు వచ్చింది. రాబోయే 10 ఏళ్లలో దేశీయ మార్కెట్‌కు 200కు పైగా విమానాలు అవసరమవుతాయని అంచనా. అదనంగా, హిందూ మహాసముద్ర ప్రాంతంలోని దేశాలకు సర్వీసులు అందించేందుకు మరో 350 విమానాల డిమాండ్ ఉంటుందని హెచ్ఏఎల్ పేర్కొంది. ఈ భాగస్వామ్యంతో భారతదేశం మళ్లీ విమాన తయారీ దేశాల జాబితాలో చోటు సంపాదించనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.