భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటి. దేశవ్యాప్తంగా 7,000 కంటే ఎక్కువ రైల్వే స్టేషన్లు ఉన్నాయి. రోజూ లక్షలాది మంది ప్రయాణికులు వీటి ద్వారా ప్రయాణం చేస్తున్నారు. ఈ రైల్వే స్టేషన్లను వార్షిక ఆదాయం మరియు ప్రయాణీకుల రద్దీ ఆధారంగా వర్గీకరించారు. వీటిలో అత్యున్నత స్థాయి గ్రేడ్ వన్ స్టేషన్లు ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉంటాయి.
గ్రేడ్ వన్ కేటగిరీలో ఉన్న స్టేషన్లు సంవత్సరానికి రూ.500 కోట్లకు పైగా ఆదాయం సంపాదిస్తాయి. అంతేకాకుండా, సంవత్సరానికి 2 కోట్లకుపైగా ప్రయాణికులను రవాణా చేస్తాయి. వీటివల్ల భారతీయ రైల్వేకు ఆర్థిక బలాన్ని మాత్రమే కాకుండా, రవాణా రంగంలో కీలక మద్దతును కూడా అందిస్తున్నాయి. అందువల్ల ఈ స్టేషన్లు దేశ రైల్వే నెట్‌వర్క్‌కు వెన్నెముకలుగా చెప్పవచ్చు.
భారతీయ రైల్వేల విస్తీర్ణాన్ని పరిశీలిస్తే, నెట్‌వర్క్ మొత్తం 70,000 కిలోమీటర్లకు పైగా వ్యాప్తి చెందింది. ప్రతి రోజు 13,000కు పైగా ప్యాసింజర్ రైళ్లు నడుస్తున్నాయి. సరుకు రవాణా రైళ్లను కలిపితే, రోజువారీ రైళ్ల సంఖ్య 23,000 దాటుతోంది. ప్రతిరోజూ 2 కోట్లకుపైగా ప్రజలు భారతీయ రైల్వేలను ఉపయోగించడం వల్ల ఈ వ్యవస్థ ఎంత ముఖ్యమైందో అర్థం చేసుకోవచ్చు.
ఆదాయం పరంగా చూస్తే, దేశంలో అత్యధిక లాభాలను తెచ్చిపెట్టే టాప్ 5 స్టేషన్లలో న్యూఢిల్లీ స్టేషన్ రూ.3,337 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. తర్వాత చెన్నై సెంట్రల్ రూ.1,299 కోట్లు, సికింద్రాబాద్ రూ.1,276 కోట్లు, హౌరా జంక్షన్ రూ.1,276 కోట్లు, హజ్రత్ నిజాముద్దీన్ రూ.1,227 కోట్లతో ఉన్నాయి. వీటిలో సికింద్రాబాద్ స్టేషన్ కూడా కీలక స్థానం సంపాదించడం తెలంగాణకు గర్వకారణం.
టాప్ ఫైవ్ స్టేషన్లతో పాటు మరికొన్ని స్టేషన్లు కూడా రూ.500 కోట్లకుపైగా ఆదాయం సాధించి గ్రేడ్ వన్ జాబితాలో చేరాయి. వాటిలో ముంబై CST, లోక్ మాన్య తిలక్ టెర్మినస్, సూరత్, అహ్మదాబాద్, పాట్నా, విజయవాడ, బెంగళూరు వంటి స్టేషన్లు ఉన్నాయి. ఇవి అధిక ఆదాయాన్ని రైల్వేలకు సమకూర్చడమే కాకుండా, లక్షలాది మంది ప్రయాణికులకు రవాణా సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఈ స్టేషన్లు దేశ అభివృద్ధిలో రైల్వేల ప్రాధాన్యతను మరింత బలంగా తెలియజేస్తున్నాయి.