వైసీపీ సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి (70) అనారోగ్యంతో కన్నుమూశారు. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం తోపుదుర్తిలోని పొలంలో పనులు పర్యవేక్షిస్తున్న సమయంలో ఆయనకు ఛాతిలో నొప్పి వచ్చింది. ఫోన్‌లో మాట్లాడుతుండగానే ఒక్కసారిగా కిందపడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినా, వైద్యులు చేసిన సీపీఆర్ ఫలితం లేకపోవడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు.
భాస్కర్‌రెడ్డి రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీలో ప్రారంభించారు. ఆత్మకూరు మండల ఎంపీపీగా పని చేసి ప్రజల్లో మంచి పేరు సంపాదించారు. అనంతరం వైసీపీ ఆవిర్భావం తరువాత తన భార్యతో కలిసి ఆ పార్టీ చేరి కీలక బాధ్యతలు చేపట్టారు. ఆయన సతీమణి తోపుదుర్తి కవిత ఉమ్మడి అనంతపురం జిల్లాలో జడ్పీ చైర్‌పర్సన్‌గా పనిచేయడం గమనార్హం.
ఆయన మృతదేహాన్ని అనంతపురం రామచంద్రనగర్‌లోని స్వగృహానికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చి నివాళులు అర్పించారు. జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి భాస్కర్‌రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే జడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, మాజీ ఎంపీ రంగయ్య, గంగుల భానుమతి, మధుసూదన్‌రెడ్డి తదితరులు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
భాస్కర్‌రెడ్డికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన మరణం వైసీపీకి తీరని లోటని స్థానిక నాయకులు పేర్కొంటున్నారు. రాజకీయాల్లోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఆయన అందరితో స్నేహపూర్వకంగా మెలిచేవారని గుర్తుచేసుకుంటున్నారు. ఆత్మకూరు, అనంతపురం ప్రజలు ఆయన మరణాన్ని తీవ్ర విచారంగా స్వీకరిస్తున్నారు.