ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు (జులై 26) రాత్రి 11 గంటలకు హైదరాబాద్ నుంచి సింగపూర్ బయలుదేరనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు "బ్రాండ్ ఏపీ" ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ విదేశీ పర్యటన చేపడుతున్నారు.
ఈ పర్యటనలో సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, పీ. నారాయణ మరియు పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు. ఈ బృందం సింగపూర్‌లో ఐదు రోజుల పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననుంది.
పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రముఖ గ్లోబల్ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. అలాగే సింగపూర్‌లో జరిగే “తెలుగు డయాస్పొరా ఫ్రం సౌత్ ఈస్ట్ ఏషియా” కార్యక్రమంలో పాల్గొననున్నారు. మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్ దేశాల నుంచి పలువురు తెలుగు పారిశ్రామికవేత్తలు, సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
ఈ సదస్సును ఏపీ ఎన్ఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. వేదికగా సింగపూర్‌లోని వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను ఎంపిక చేశారు. సుమారు 1,500 మంది ప్రతినిధులు హాజరయ్యే ఈ సదస్సుకు అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.
సదస్సు సందర్భంగా సీఎం చంద్రబాబు పీ4 (P4: People–Public–Private–Partnership–for–Progress) కార్యక్రమంలో భాగంగా ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలను రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా ఉండాలంటారు. రాష్ట్ర నిరుద్యోగ యువతకు దేశం లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు చర్చలు సాగనున్నాయి.
అలాగే, వివిధ దేశాలకు ఏపీ ఉత్పత్తుల ఎగుమతుల కోసం ఎన్ఆర్ఐల సహకారంతో ప్రణాళికలు రూపొందించనున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.
పర్యటనలో భాగంగా చంద్రబాబు బృందం స్పోర్ట్స్ హబ్‌లు, పోర్టులు, మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ కేంద్రాలను సందర్శించనుంది. ఈ పర్యటనతో రాష్ట్ర అభివృద్ధికి కొత్త దారులు వెలిసే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        