పేద మహిళలకు ఆర్థిక భరోసా కల్పించి, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ (Suresh Kumar) అన్నారు. విజయవాడలోని పంజా సెంటర్లో తొలిసారిగా ఏర్పాటు చేసిన తృప్తి క్యాంటీన్ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నెల్లూరులో ప్రారంభించిన తృప్తి క్యాంటీన్ విజయవంతం కావడంతో విజయవాడలో తొలిసారిగా ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో 750 క్యాంటీన్లు ఏర్పాటు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.
మెప్మా సహకారంతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని స్వయం సహాయక మహిళలతో వీటిని ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం తెప్పించడమే ప్రభుత్వం లక్ష్యమన్నారు.
మెప్మా ఉత్పత్తులకు ఒక బ్రాండ్ కల్పిస్తామని, భవిష్యత్తులో మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా ప్రోత్సాహిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్, తదితరులు పాల్గొన్నారు.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        