జమ్మూకాశ్మీర్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రసంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (TRF)ను ఇటీవల అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. TRF సంస్థ పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అనుబంధంగా పనిచేస్తుందని భారత నిఘా సంస్థలు చెబుతున్నాయి. అయితే అమెరికా నిర్ణయంపై తాజాగా పాకిస్థాన్ స్పందించింది.
వాషింగ్టన్ డీసీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ 
"TRFను ఉగ్రసంస్థగా ప్రకటించడంపై మాకు అభ్యంతరం లేదు. అది అమెరికా సార్వభౌమాధికారం. ఆధారాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం స్వాగతించదగినదే. అయితే TRFకు లష్కరే తోయిబాతో సంబంధం పెట్టడం తగదు. ఆ సంస్థను మేము ఇప్పటికే నిర్వీర్యం చేశాం," అని స్పష్టం చేశారు.
పహల్గామ్ ఘటనపై మాట్లాడితే
ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్‌లోని బైసరాన్ వ్యాలీలో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణ లేకుండా కాల్పులు జరిపిన ఘటనలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి మొదట TRFనే బాధ్యత వహించిందని ప్రకటించింది. కానీ అనంతరం తాము పాల్పడలేదని మారుమాటున చెప్పింది.
ఈ దాడిని దృష్టిలో ఉంచుకొని అమెరికా TRFను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా గుర్తించగా, భారత్ ఇప్పటికే 2023 జనవరిలోనే ఈ సంస్థను చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం కింద ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        