వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరోసారి కడప రాజకీయాలను వేడెక్కిస్తోంది. తన తండ్రి మరణానికి కారకులైన వారిని గుర్తించేందుకు ఆయన కుమార్తె సునీత రెడ్డి న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ కేసు దర్యాప్తులో జాప్యం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసు విచారణ కొనసాగింపుపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని సుప్రీంకోర్టు ఇటీవల ట్రయల్ కోర్టుకు అప్పగించింది. దీనిపై స్పష్టత కోరుతూ రెండు వారాల్లోగా కొత్తగా పిటిషన్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు సునీతకు సూచించింది. ట్రయల్ కోర్టు ఈ పిటిషన్‌ను స్వీకరించిన నాటి నుంచి ఎనిమిది వారాల్లోగా దానిపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ట్రయల్ కోర్టు నుంచి స్పష్టత వచ్చేంత వరకు నిందితుల బెయిల్ రద్దు పిటిషన్లపై విచారణ చేపట్టబోమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ కేసును మళ్లీ సీబీఐకి అప్పగించాలా వద్దా అనే విషయంపై కూడా త్వరలో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
సునీత తరపు న్యాయవాదులు నిందితులందరి బెయిల్ పిటిషన్లను రద్దు చేయాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో హత్యకు సంబంధించిన ఆధారాలను మాయం చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసును మళ్లీ సీబీఐకి అప్పగిస్తే కడప ఎంపీ అవినాష్ రెడ్డి మెడకు ఉచ్చు బిగుసుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు అవినాష్ రెడ్డి మెడకు ఉచ్చు బిగుసుకుంటే, జగన్ రాజకీయ జీవితం చుక్కల్లో పడుతుందని అభిప్రాయపడుతున్నారు.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆయన సొంత బాబాయి వివేకానందరెడ్డికి న్యాయం జరగకపోవడం గమనార్హం. ఈ కేసు విచారణలో జగన్ పాత్ర ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సునీత చేస్తున్న న్యాయపోరాటానికి అనుకూలంగా తీర్పు వస్తుందని మరికొందరు భావిస్తున్నారు. మహిళా అయిన సునీత చేస్తున్న ఈ పోరాటానికి ఫలితం దక్కుతుందో లేదో వేచి చూడాలి.