ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు మరోసారి పెద్ద సంచలనం రేపుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు ప్రముఖులు అరెస్టయి, కొందరికి బెయిల్ లభించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో ముఖ్యనిందితుల్లో ఒకరైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని తమ కస్టడీకి అప్పగించాలని సిట్ అధికారులు కోర్టును ఆశ్రయించారు.
అమరావతిలోని కోర్టులో సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం, మిథున్ రెడ్డిని ఐదు రోజుల పాటు విచారణ కోసం తమ కస్టడీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నప్పటికీ, దర్యాప్తులో కొన్ని కీలక అంశాలను తెలుసుకోవడానికి కస్టడీ అవసరమని అధికారులు పేర్కొన్నారు.
ఇక ఇదే కేసులో మరోముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ లకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. అయితే ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి మాత్రం కోర్టు బెయిల్ ఇవ్వలేదు. దీంతో ఈ కేసు మరింత చర్చనీయాంశమవుతోంది.
అంతేకాకుండా ఎంపీ మిథున్ రెడ్డి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కోర్టు, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికలలో ఓటు వేసిన తరువాత మళ్లీ జైలులో లొంగిపోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు మద్యం కుంభకోణం కేసులో అధికారులు పెద్దఎత్తున ఆస్తులు, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ చర్యలతో కేసు మరింత తీవ్రతరం అవుతోంది. సిట్ పిటిషన్‌పై కోర్టు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో అన్నదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమైంది.