బీఎస్ఎన్ఎల్ పోటీకి కొత్త ఆఫర్
దేశంలో ప్రైవేట్ టెలికాం కంపెనీలు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియాలకు గట్టి పోటీ ఇవ్వాలని ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ప్రయత్నిస్తోంది. కొత్త కొత్త ఆఫర్లు, తక్కువ ధరల ప్రీపెయిడ్ ప్లాన్లతో కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇటీవలే "ఫ్రీడమ్ ఆఫర్" పేరిట రూ.1కే నెల రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, డేటాను అందించిన బీఎస్ఎన్ఎల్, ఇప్పుడు మరింత చౌకైన రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ధరలో ఇలాంటి ఆఫర్‌ను ప్రైవేట్ టెలికాం సంస్థలు ఏవీ అందించకపోవడంతో ఇది వినియోగదారులకు లాభదాయకంగా మారనుంది.
రూ.199 ప్లాన్ వివరాలు
బీఎస్ఎన్ఎల్ రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఇందులో రోజుకు 2GB ఇంటర్నెట్ డేటా అందించనున్నారు. డేటా లిమిట్ పూర్తయినా 40kbps స్పీడ్‌తో ఇంటర్నెట్ కనెక్షన్ కొనసాగుతుంది. అలాగే దేశవ్యాప్తంగా అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్, రోజుకు 100 SMSలు కూడా లభిస్తాయి. ఇతర ప్రైవేట్ కంపెనీలు ఇలాంటి ఆఫర్‌లను రూ.200లోపు అందించడం లేదు. దీంతో బీఎస్ఎన్ఎల్ ఆఫర్ ప్రస్తుతం బడ్జెట్ కస్టమర్లకు బంగారు అవకాశం అని చెప్పవచ్చు. అయితే ఈ ప్లాన్‌లో 4G డేటానే అందించబడుతుంది. ప్రైవేట్ కంపెనీలు మాత్రం ఇప్పటికే 5G డేటాను అందిస్తున్నాయి.
ప్రైవేట్ కంపెనీల ప్లాన్‌లతో పోలిక
జియో రూ.349 ప్లాన్‌లో 28 రోజుల పాటు రోజుకు 2GB డేటా, అపరిమిత కాలింగ్, 100 SMSలతో పాటు JioTV సబ్‌స్క్రిప్షన్ ఇస్తోంది. ఎయిర్‌టెల్ రూ.349 ప్లాన్‌లో 5G డేటాతో పాటు ఆపిల్ మ్యూజిక్, SonyLIV, మరికొన్ని 20 OTT ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ ఇస్తోంది. వొడాఫోన్-ఐడియా (Vi) రూ.408 ప్లాన్‌లో రోజుకు 2GB డేటా, అపరిమిత కాలింగ్, SonyLIV సబ్‌స్క్రిప్షన్ ఇస్తోంది. డేటా లిమిట్ పూర్తయినా 64kbps స్పీడ్‌తో ఇంటర్నెట్ కొనసాగుతుంది. ఈ ప్లాన్‌లతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ రూ.199 ప్లాన్ చౌకగా ఉన్నప్పటికీ, అదనపు సర్వీసులు అందకపోవడం పెద్ద లోటు.
కస్టమర్ల కోల్పోతున్న బీఎస్ఎన్ఎల్
తాజా ట్రై (TRAI) నివేదిక ప్రకారం బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్ బేస్‌ను కోల్పోతూనే ఉంది. 2025 జూలైలోనే 1.01 లక్షల మంది కస్టమర్లు సంస్థను వదిలేశారు. మొత్తం మార్కెట్ షేర్ 8% కంటే తక్కువకు పడిపోయింది. అదే సమయంలో రిలయన్స్ జియో 4.83 లక్షల మంది కొత్త కస్టమర్లను చేర్చుకుని అగ్రస్థానాన్ని నిలుపుకుంది. ఎయిర్‌టెల్ కూడా 4.64 లక్షల కొత్త కస్టమర్లను సంపాదించింది. వొడాఫోన్-ఐడియా మాత్రం 3.59 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో బీఎస్ఎన్ఎల్ చౌకైన ప్లాన్లు తీసుకువచ్చి పోటీని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నా, 5G సేవల లేమి వల్ల వినియోగదారుల నమ్మకాన్ని తిరిగి గెలుచుకోవడం పెద్ద సవాలుగా మారింది.