నటి, నిర్మాతగా గుర్తింపు పొందిన మంచు లక్ష్మి సేవా కార్యక్రమాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘టీచ్ ఫర్ చేంజ్’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ, విద్యారంగ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నారు. తాజాగా ఆమె ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని పది ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోవడం విశేషం. విద్యార్థుల భవిష్యత్తు మెరుగుపడేలా తమ సేవలు కొనసాగించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
ఇంతకుముందు తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో పది ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్నామనీ, ఇప్పుడు అమరావతిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం మరింత ఆనందంగా ఉందని మంచు లక్ష్మి తెలిపారు. తమ సంస్థతో పాటు మరికొందరు దాతలు ముందుకు రావడం వలన ఈ సేవా కార్యక్రమం మరింత విస్తరించిందని ఆమె వెల్లడించారు. దత్తత తీసుకున్న పాఠశాలల్లో విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువుకునే వాతావరణాన్ని కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు. “పిల్లల అభ్యాసం ఎక్కడా ఆగిపోకూడదు. పాఠశాలకు అవసరమయ్యే ప్రతి సదుపాయం మేం సమకూరుస్తాం” అని ఆమె పేర్కొన్నారు.
మంచు లక్ష్మి సేవలు తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా అనేక ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశారని ఆమె గుర్తుచేశారు. విద్యారంగంలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రారంభించిన ‘టీచ్ ఫర్ చేంజ్’ ద్వారా మరిన్ని కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల ద్వారా పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించి, వారి భవిష్యత్తు నిర్మాణంలో భాగస్వాములవ్వడం తమకు గర్వకారణమని తెలిపారు.
సామాజిక సేవతోపాటు సినీ రంగంలోనూ మంచు లక్ష్మి తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘దక్ష’ చిత్రం సెప్టెంబర్ 19న విడుదలకు సిద్ధమవుతోంది. ఒక వైపు సేవా కార్యక్రమాలతో, మరో వైపు సినిమాలతో బిజీగా ఉన్న మంచు లక్ష్మి.. మహిళా సాధికారత, విద్యారంగ అభివృద్ధి, సమాజ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తుండటం సినీ వర్గాల్లోనూ, సామాజిక వర్గాల్లోనూ ప్రశంసలు అందుకుంటోంది.