తెలంగాణలో సంచలనం సృష్టించిన నిజామాబాద్ ఎన్‌కౌంటర్ ఘటనపై స్పష్టత ఇచ్చారు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి. ఎన్‌కౌంటర్‌లో రియాజ్ మృతిచెందినట్లు ఆయన ధృవీకరించారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్ ఇవాళ ఉదయం బాత్రూం వెళ్లే సందర్భంలో తప్పించుకునేందుకు ప్రయత్నించాడని చెప్పారు. పోలీసులు వెంటనే అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, రియాజ్ అక్కడే ఉన్న పోలీసు వెపన్‌ను తీసుకుని కాల్పులకు యత్నించాడని వెల్లడించారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపడంతో రియాజ్ మృతిచెందినట్లు వివరించారు.
డీజీపీ మాట్లాడుతూ, "రియాజ్‌పై పలు నేర కేసులు ఉన్నాయి. ఇతడు నిరంతరం పోలీసులకు తలనొప్పిగా మారాడు. అతడు మళ్లీ తప్పించుకుంటే మరిన్ని ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. పోలీసులు విధి నిర్వహణలో భాగంగా అతడిని అడ్డుకునే ప్రయత్నంలో కాల్పులు జరపాల్సి వచ్చింది" అని పేర్కొన్నారు.
ఈ ఘటన వెనుక ఉన్న నేపథ్యం కూడా పోలీసులు ఇలా వివరించారు. ఓ కేసు విషయంలో కానిస్టేబుల్ ప్రమోద్ రియాజ్‌ను పట్టుకుని బైకుపై పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తుండగా, రియాజ్ తన వద్ద ఉన్న కత్తితో ప్రమోద్‌పై దాడి చేశాడు. ఛాతీలో కత్తి దూసి హత్య చేసిన అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత వెంబడించిన మరో ఎస్సైపై కూడా దాడి చేశాడు. గాయపడిన ప్రమోద్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో నిజామాబాద్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో తీవ్ర ఆవేదన నెలకొంది.
రియాజ్‌పై ఇప్పటికే చైన్ స్నాచింగ్, బైక్ దొంగతనాలు, గొడవలు వంటి 60కి పైగా కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్పారు. అతను పలు సార్లు జైలుకెళ్లి తిరిగి నేరాలకు పాల్పడుతూ వచ్చాడని వివరించారు. రియాజ్ ప్రత్యేకంగా బుల్లెట్ బైకులను దొంగిలించడంలో నిపుణుడు. అతని నేర ప్రవర్తన కారణంగా పోలీసులు అతడిని పునరావృత నేరస్థుడిగా గుర్తించారు.
శనివారం పోలీసులు అతడిని పట్టుకుని నిజామాబాద్ ఆస్పత్రిలో చికిత్స అందజేస్తుండగా, ఈరోజు తప్పించుకునే ప్రయత్నం సమయంలో కాల్పులు జరిగాయి. ఈ సంఘటనతో రియాజ్ కథకు ముగింపు పలికినట్లయింది. పోలీసులు ఈ ఘటనపై పూర్తి వివరాలతో నివేదిక సిద్ధం చేసి, ప్రభుత్వానికి సమర్పించనున్నారు.
ఇదిలా ఉండగా, కానిస్టేబుల్ ప్రమోద్ హత్యతో పోలీస్ వ్యవస్థలో తీవ్ర కలకలం రేగింది. సహచరులు, అధికారులు ప్రమోద్ కుటుంబానికి సానుభూతి తెలిపారు. మరోవైపు, రియాజ్ ఎన్‌కౌంటర్‌పై స్థానికులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు కొందరు పోలీసులు సరైన నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయపడితే, మరికొందరు దీనిపై విచారణ జరపాలని కోరుతున్నారు. మొత్తానికి, కరుడుగట్టిన నేరస్థుడు రియాజ్ జీవితం ఈరోజుతో ముగిసింది.