మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అఖండ ఘన విజయం తర్వాత నందమూరి బాలకృష్ణ అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అఖండ 2 సినిమా విడుదల తేదీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే కాగా దీపావళి సందర్భంగా చిత్ర బృందం సోషల్ మీడియా వేదికన X ద్వారా ఒక ప్రకటనలను విడుదల చేసింది ఈ ప్రకటనతో నందమూరి అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది.
అఖండ 2 చిత్రాన్ని డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ప్రకటన విడుదల చేసే సమయంలో A divine high like never before (ఇంతకు ముందెన్నడూ లేని దైవికమైన అనుభూతి) అనే క్యాప్షన్‌ను జోడించారు. ఈ క్యాప్షన్ ద్వారా ఈ సీక్వెల్ తొలి భాగాన్ని మించే స్థాయిలో మరింత శక్తివంతమైన కథాంశం మరియు యాక్షన్‌తో కూడి ఉంటుందని అంచనాలు పెరిగాయి.
అఖండ అభిమానులను మరింత ఉత్సాహపరిచే మరో బిగ్ అప్‌డేట్‌ను కూడా చిత్ర బృందం వెల్లడించింది. అక్టోబర్ 24వ తేదీ సాయంత్రం 4:54 గంటలకు బ్లాస్టింగ్ రోర్ (పేలుడు లాంటి గర్జన) రాబోతున్నట్లు ప్రకటించారు. ఇది సినిమా టీజర్ లేదా ఒక పవర్ ఫుల్ గ్లింప్స్ అయ్యే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు బలంగా అంచనా వేస్తున్నాయి. ఈ ప్రకటనతో సోషల్ మీడియాలో #Akhanda2 హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి దూసుకుపోతుంది.
ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉండటానికి ప్రధాన కారణం నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్. సింహా లెజెండ్ అఖండ వంటి మూడు ఘన విజయాల తర్వాత వస్తున్న ఈ నాలుగో ప్రాజెక్ట్ కావడంతో వీరి సెంటిమెంట్ ఈసారి కూడా పని చేస్తుందని అభిమానులు బలంగా విశ్వసిస్తున్నారు. ఈ సీక్వెల్‌లో బాలకృష్ణ మరోసారి తన విశ్వరూపాన్ని చూపిస్తూ యాక్షన్ ఎమోషన్, దైవిక అంశాల కలయికతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నారని ఇప్పటివరకు వచ్చిన పోస్టర్స్ టీజర్ చూస్తేనే తెలిసిపోతుంది..
మూడు రోజుల్లో రాబోతున్న బ్లాస్టింగ్ రోర్ అప్‌డేట్ కోసం అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. తొలి భాగం సృష్టించిన ప్రభంజనం దృష్ట్యా డిసెంబర్ 5న విడుదల కాబోతున్న అఖండ 2 బాక్సాఫీస్‌పై ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో, ఎంతటి 'థాండవం' చేస్తుందో చూడాలి. ఇది బాలయ్య కెరీర్‌లో మరో మైలురాయి కావడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు