డెన్వర్ నుంచి లాస్ ఏంజెలిస్‌కు వెళ్తున్న యునైటెడ్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం గాల్లో ఉన్నపుడు ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఎటువంటి హెచ్చరిక లేకుండానే సడన్‌గా కాక్పిట్ విండ్షీల్డ్ (విమాన అద్దం) పగిలిపోయింది. ఆ సమయంలో విమానం 36 వేల ఫీట్ల ఎత్తులో ప్రయాణిస్తోంది. పగిలిన గాజు ముక్కలు పైలట్ వైపు చెలరేగడంతో ఆయన చేతికి గాయాలయ్యాయి. అద్భుతమైన సమయస్ఫూర్తి చూపిన పైలట్, తక్షణమే విమాన నియంత్రణ కేంద్రానికి సమాచారం అందించి ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు సిద్ధమయ్యాడు. డెన్వర్ విమానాశ్రయంలో సేఫ్ ల్యాండింగ్ చేయడంతో 140 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.
విమాన అద్దం ఎలా పగిలిందన్నది ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ప్రారంభ అంచనాల ప్రకారం “విమానాన్ని ఒక ఉల్క లేదా గగనతలంలో తేలియాడే వస్తువు ఢీకొట్టిన అవకాశం ఉంది” అని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఫ్లైట్ డేటా రికార్డింగ్‌లు కూడా పరిశీలనలో ఉన్నాయి. పైలట్‌కు స్వల్ప కాలిన గాయాలు అయ్యాయని, ఆయనను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు తెలిపారు.
అయితే, ఈ ఘటనతో ప్రయాణికుల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. అకస్మాత్తుగా విండ్ షీల్డ్ పగిలి శబ్ధం రావడంతో చాలామంది టెన్షన్‌కు గురయ్యారని, పైలట్ సున్నితంగా స్పందించకపోయుంటే పెద్ద ప్రమాదమే జరిగేదని కొందరు ప్రయాణికులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. మేము కేవలం కొన్ని క్షణాల్లోనే ప్రాణాలను కోల్పోయేవాళ్లం. కానీ పైలట్ గారు నిజంగా హీరో. తెలివిగా వ్యవహరించి మాకు కొత్త జీవితం ఇచ్చారు” అని ఓ ప్రయాణికుడు తెలిపాడు.
బోయింగ్ 737 మ్యాక్స్ సిరీస్ విమానాలు గతంలో కూడా పలు సార్లు టెక్నికల్ ఇష్యూస్ కారణంగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌పై ఇప్పటికే అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తోంది. తాజా ఘటనతో మళ్లీ బోయింగ్ మ్యాక్స్ భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తాయి.
ప్రస్తుతం విమానాన్ని డెన్వర్ ఎయిర్‌పోర్ట్‌లో నిలిపి, FAA నిపుణులు టెక్నికల్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. పగిలిన విండ్షీల్డ్‌పై ల్యాబ్ విశ్లేషణలు జరుగుతున్నాయి. ఉల్క ఢీ కొట్టినదేనా? లేక గాలి ఒత్తిడి మార్పులు కారణమా? అనే దానిపై పూర్తి రిపోర్ట్ వచ్చే వరకు ఎయిర్‌లైన్స్ అధికారులు వ్యాఖ్యానించరాదని తెలిపారు.