విజయవాడ (Vijayawada), విశాఖ (Visakhapatnam) నగరాల్లో మెట్రో రైలు (Metro train) ప్రాజెక్టులకు టెండర్లు పిలవనున్నారు. విజయవాడలో ఈ ప్రాజెక్టు తొలిదశ కింద రెండు కారిడార్ల అనుమతి మంజూరుకు అడుగులు పడుతున్నాయి. రూ.10,118 కోట్ల అంచనా వ్యయంతో చేపడతారు. ప్రభుత్వ జాయింట్ వెంచర్, ఈక్విటీ ఫండింగ్ సగం సగం ఉండేలా ఈ ప్రాజెక్టు ముందుకు సాగుతుంది.
విశాఖ నగరంలో రూ.11,498 కోట్ల అంచనా వ్యయంతో ఇదే పద్ధతిలో పనులు చేస్తారు. ఈ రెండుచోట్ల అంచనా వ్యయంలో 40% మేర విలువైన పనులకు టెండర్లు పిలిచేందుకు మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన గురువారం సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది.
విశాఖను ఐటీ హబ్ (IT Hub) గా తీర్చిదిద్దేందుకు వీలుగా భూ కేటాయింపులు, పెట్టుబడుల ప్రతిపాదనలను ఆమోదించడంతో పాటు ఉత్తరాంధ్ర (Uttarandhra)లో భూబ్యాంకు ఏర్పాటుకు నిర్ణయించింది. ఇందుకు 1,941.19 ఎకరాల భూమిని విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో తీసుకోనున్నారు. విశాఖ అర్బన్ ల్యాండ్ పూలింగ్ పథకం 2016 నిబంధనల ప్రకారం ఈ భూమి తీసుకునేలా విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి అనుమతి ఇచ్చారు.
రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ (Electronic) పరిశ్రమ విస్తృతమయ్యేలా నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి పార్థసారథి విలేకరులకు వెల్లడించారు. ఆ వివరాలివి..
'ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ విధానం 4.0'కు ఆమోదం. విడిభాగాలతో సహా మొత్తం ఎలక్ట్రానిక్ పరికరాలు రాష్ట్రంలోనే తయారు కావడానికి ఈ విధానం ఉపకరిస్తుంది. ఏటా 100 నుంచి 150 బిలియన్ డాలర్ల వ్యాపారం ఇక్కడ జరుగుతుందని అంచనా.
రాష్ట్రంలో రూ.79,900 కోట్ల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనలకు పచ్చజెండా. వీటి వల్ల ఇంధన, ఐటీ రంగాల్లో 1.50 లక్షలమందికి ఉపాధి కల్పన.
తిరుపతి (Tirupati)లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై జస్టిస్ సత్యనారాయణమూర్తి కమిటీ నివేదికకు మంత్రిమండలి ఆమోదం. నివేదికలోని సిఫార్సుల అమలుకు నిర్ణయం.
ప్రతి రైతు నుంచి 20 క్వింటాళ్లు మాత్రమే పొగాకు కొనుగోలు చేసేలా మార్గదర్శకాలకు ఆమోదం. మొత్తం 20 మిలియన్ టన్నుల సేకరణ లక్ష్యం. మొదట వచ్చిన వారి నుంచి మొదట కొనే పద్ధతికి బదులు 20 క్వింటాళ్ల వరకే కొనుగోలు. మొదట కొద్దిమొత్తంలో సరకు ఉన్న రైతుల నుంచి కొనుగోళ్లు మొదలుపెడతారు. అవసరమయితే మరిన్ని సేకరణ కేంద్రాల ఏర్పాటు.
జులై 12 వరకు కొనుగోళ్లకు సంబంధించిన షెడ్యూలు యథాతథంగా అమలు. ఆ తర్వాతి నుంచి తాజా విధానాల ప్రకారం షెడ్యూల్ రూపొందించి కొనుగోళ్లు.
నంద్యాల (Nandyal) జిల్లా పాణ్యం మండలంలో గోరకల్లు బ్యాలెన్సింగ్ జలాశయం మరమ్మతులకు తొలిదశ కింద రూ.53 కోట్లతో చేపట్టేందుకు ఆమోదం.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        