ఆంధ్రప్రదేశ్‌లో జనాభా పెంపునకు కొత్త విధానం రూపొందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇటీవల సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు — “ఇంకా ఎక్కువ మంది పిల్లలు కనేవాళ్లే నిజమైన దేశభక్తులు” — ఈ దిశగా సంకేతాలివ్వగా, ఇప్పుడు ప్రభుత్వం అందుకు అనుగుణంగా పలు ప్రోత్సాహకాలు అమలుచేయాలని యోచిస్తోంది.
మూడో బిడ్డ పుట్టిన తల్లులకు నగదు ప్రోత్సాహం, నాలుగో బిడ్డకు ఆస్తిపన్ను మినహాయింపు వంటి ప్రణాళికలు ఈ డ్రాఫ్ట్ పాలసీలో ఉన్నాయి. కొన్ని కుటుంబాల్లో పిల్లలు పుట్టడంలో సమస్యలు ఎదురవుతుండటంతో, వారికి IVF చికిత్సలో భాగంగా ఖర్చును partially భరించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
వర్కింగ్ తల్లులకి మాతృత్వ సెలవును 6 నెలల నుంచి 12 నెలలకు పెంచే యోచనతో పాటు, వారికి వర్క్ ఫ్రమ్ హోం సదుపాయం కల్పించాలన్న ఆలోచన కూడా ముసాయిదాలో ఉంది. ఈ సౌకర్యాలు ప్రైవేట్ ఉద్యోగుల్లోకి కూడా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
పిల్లల సంరక్షణ కోసం ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో క్రెచ్‌లు ఏర్పాటు చేసి, వాటిలో పని చేసేవారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నది మరో ముఖ్య అంశం.
ప్రస్తుతం ప్రజలు ఎక్కువ మంది పిల్లలు కనాలన్న ఆలోచన లేకుండా ఒకరు లేదా ఇద్దరితో ఆగిపోతున్నారు. దీని వల్ల భవిష్యత్తులో వృద్ధుల సంఖ్య పెరిగి, పని చేసే వయసు ప్రజలు తగ్గిపోతారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని జనాభా పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన డ్రాఫ్ట్ పాలసీని సిద్ధం చేస్తోంది. ఈ పాలసీ ద్వారా తల్లిదండ్రుల భాధ్యతలు తగ్గించడంతో పాటు, పిల్లల భవిష్యత్తును సురక్షితం చేసే దిశగా అడుగులు వేస్తోంది.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        