హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రాజెక్టులు చేపడుతోంది. ఈ క్రమంలో భాగ్యనగరానికి మరో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోయే ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి రేవంత్ సర్కార్ ఆమోదం తెలిపింది. చారిత్రక మీరాలం చెరువుపై రూ.430 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జిని నిర్మించనున్నారు.
ఈ నిర్మాణానికి రాష్ట్ర పురపాలక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూసీ నది అభివృద్ధి సంస్థ (MRDCL) ఆధ్వర్యంలో బ్రిడ్జి పనులు చేపట్టనున్నారు. అవసరమైన భూసేకరణ, టెండర్లు వెంటనే పూర్తి చేసి నిర్మాణాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఐఐటీ హైదరాబాద్, జేఎన్‌టీయూ, నిట్ వరంగల్ వంటి ప్రఖ్యాత విద్యాసంస్థల పరిశీలనకు ఐకానిక్ బ్రిడ్జి నమూనాను పంపించి, నిపుణుల అనుమతి తర్వాత పనులు ప్రారంభించనున్నారు.
బ్రిడ్జి నిర్మాణ లక్షణాలు:
పొడవు: 2.5 కిలోమీటర్లు
వెడల్పు: 16.5 మీటర్లు
స్థానాలు: చింతల్‌మెట్ నుంచి శాస్త్రిపురం మీదుగా బెంగళూరు నేషనల్ హైవే వరకు
ఈ బ్రిడ్జి వలన చింతల్‌మెట్, అత్తాపూర్, కిషన్‌బాగ్, బహదూర్‌పుర ప్రాంత వాసులకు, అలాగే ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలుగనుంది.
మీరాలం చెరువు – చారిత్రక వైభవం:
నిజాం కాలంలో మూడవ నిజాం పాలనలో 1804లో ప్రారంభమై 1806లో పూర్తి అయిన మీరాలం చెరువు, దివాన్ మీర్ ఆలం బహదూర్ పేరుతో ప్రసిద్ధి చెందింది. అర్ధచంద్రాకార చెరువు కట్ట, మధ్యలో మూడు దీవులు, చుట్టూ ఉన్న పర్యాటక ప్రాంతాలు ఈ ప్రాంతాన్ని విశిష్టంగా మార్చాయి. చెరువు దిగువన జంతు ప్రదర్శనశాల కూడా ఉంది. తాజా బ్రిడ్జి ఈ రెండు ప్రాంతాలను అనుసంధానించి, పర్యాటక అభివృద్ధికి దోహదపడనుంది.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        