చిన్నారులపై లైంగిక వేధింపుల ఆరోపణలతో భారత సంతతికి చెందిన కోపైలట్ రుస్తుం భగ్వాగర్‌ను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో ల్యాండ్ అయిన వెంటనే, అతను ఉన్న కాక్‌పిట్‌కి వెళ్లిన అధికారులు, ప్రత్యక్షంగానే అతడిని అదుపులోకి తీసుకున్నారు. భగ్వాగర్ డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానంలో విధులు నిర్వహిస్తున్నాడు.
ఈ విమానం మిన్నియాపోలిస్ నుంచి బయలుదేరి శాన్‌ఫ్రాన్సిస్కోకు చేరిన అనంతరం, పోలీసులు పక్కా ప్రణాళికతో కాక్‌పిట్‌కి వెళ్లి, భగ్వాగర్‌కు బేడీలు వేసి బయటకు తీసుకొచ్చారు. ఈ అనూహ్య పరిణామాన్ని చూసిన ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. అతను తప్పించుకునే అవకాశముందని భావించిన పోలీసులు గోప్యతతో ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
అతనిపై ఈ ఏడాది ఏప్రిల్ నుంచి చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇదే నేపథ్యంలో ఆదివారం అరెస్టు చేశారు. ఈ ఘటనపై డెల్టా ఎయిర్‌లైన్స్ స్పందిస్తూ, తమ సంస్థలో అనైతిక ప్రవర్తనను ఏమాత్రం సహించమని, భగ్వాగర్‌పై వచ్చిన ఆరోపణలు తమను తీవ్రంగా కలిచివేశాయని వెల్లడించింది. దీంతో అతడిని తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు పేర్కొంది.