సింగపూర్ ప్రజల ఉత్సాహం రాష్ట్ర అభివృద్ధికి దోహదం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. పెట్టుబడులే లక్ష్యంగా సింగపూర్లో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా.. తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు.
"తెదేపా హయాంలోనే మూడేళ్లలో 300 ఇంజినీరింగ్ కళాశాలలు ఏపీలో ఏర్పాటయ్యాయి. పెద్దఎత్తున ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటుపై చాలా మంది విమర్శించారు. 1991లో పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు.
దేశ ఆర్థిక వ్యవస్థకు దశ, దిశ రూపకల్పన చేసిన వ్యక్తి పీవీ నరసింహారావు. భవిష్యత్తు అంతా ఐటీ, నాలెడ్జ్ ఎకానమీకి ఉంటుందని నమ్మా. నాలెడ్జ్ ఎకానమీలో తెలగుజాతి అగ్రగామిగా ఉండాలంటే ఐటీని ప్రమోట్ చేయాలని ఆలోచించా.
సింగపూర్లో వేలాది తెలుగు ప్రజలు ఉండేందుకు ఆనాటి ఆలోచనలే కారణం. ప్రపంచంలో 120కి పైగా దేశాల్లో తెలుగు ప్రజలు ఉన్నారు. ఒక వ్యక్తి ఫౌండేషన్ ద్వారా సింగపూర్ గౌరవప్రదమైన దేశంగా ఎదిగింది. సింగపూర్లో 40వేల మంది తెలుగు ప్రజలు ఉన్నారంటే గర్వంగా ఉంది.
అమరావతి మాస్టర్ ప్లాన్ను సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా తయారు చేసి ఇచ్చింది. 2019 తర్వాత సింగపూర్ ప్రభుత్వాన్ని తప్పుపట్టే పరిస్థితి తెచ్చారు. ప్రభుత్వ బ్రాండ్ పోతే ఏపీ నష్టపోతుందని సింగపూర్ ప్రభుత్వానికి చెప్పా. గతంలో జరిగిన తప్పులు సరిదిద్దాలని సింగపూర్ పర్యటనకు వచ్చా" అని చంద్రబాబు వివరించారు.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        