రైల్వే మరో కీలక ముందడుగు వేసింది. దేశంలో మొట్టమొదటిగా హైడ్రోజన్ ఆధారిత కోచ్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించింది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో ఈ పరీక్ష విజయవంతమైందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
1,200 హెచ్‌పీ సామర్థ్యం గల డ్రైవింగ్ పవర్ కారును పరీక్షించామని చెప్పారు. పర్యావరణ హిత రవాణాపై దృష్టి సారించిన రైల్వే, డీజిల్ బోగీలను దశలవారీగా తొలగిస్తూ, ఎలక్ట్రిక్, హైడ్రోజన్ వంటి స్వచ్ఛ ఇంధనాలపై దృష్టి పెడుతోంది. కేంద్రం స్క్రాప్ పాలసీతోపాటు హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ పథకం కింద దేశవ్యాప్తంగా 35 హైడ్రోజన్ రైళ్లను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
పర్యావరణానికి హాని కలిగించని విధంగా దేశీయ రవాణా వ్యవస్థ అడుగులు వేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే డీజిల్ బోగీలను క్రమంగా దశలవారీగా తొలగిస్తోంది రైల్వే మంత్రిత్వ శాఖ. దీని స్థానంలో ఎలక్ట్రిక్ ఇంజిన్లను వినియోగంలోకి తీసుకొస్తోంది. దీనికోసం పట్టాల విద్యుదీకరణ శరవేగంగా కొనసాగిస్తోంది.
అదే సమయంలో 15 సంవత్సరాల కాలం చెల్లిన వాహనాలకు కూడా చెల్లుచీటి పలుకుతోంది. దీనికోసం ప్రత్యేకంగా స్క్రాప్ పాలసీని అమలులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. పర్యావరణ అనుకూల రవాణా విధానాల్లో భాగంగా ఇప్పుడు తాజాగా హైడ్రోజన్ ఆధారిత రైళ్లను కూడా పట్టాలపై పరుగులు పెట్టే రోజు ఎంతో దూరం లేదు.
హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ కార్యక్రమంలో భాగంగా 35 హైడ్రోజన్ ఆధారిత రైళ్లను నడపాలని రైల్వే మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ హైడ్రోజన్ కోచ్ లకు రూప కల్పన చేసింది. ఈ రైళ్లను దేశవ్యాప్తంగా వారసత్వ ప్రదేశాలు, చారిత్రాత్మక ప్రాంతాలు, పర్వత మార్గాల్లో నడిపించనుంది. ఒక్కో రైలుకు సుమారు 80 కోట్ల రూపాయలు వ్యయం అవుతాయి.
పట్టాల కోసం ఒక్కో రూట్ లో అదనంగా 70 కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి ఉంటుంది. రైల్వే ఓ పైలట్ ప్రాజెక్ట్‌ను కూడా ప్రారంభించింది. దీనిలో భాగంగా ప్రస్తుతం ఉన్న డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (DEMU)ను హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌తో అనుసంధానిస్తారు. ఈ ప్రాజెక్ట్ కోసం 111.83 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోన్నారు. దీనిని నార్తరన్ రైల్వే పరిధిలోని జింద్-సోనిపట్ మార్గంలో నడపడానికి ప్రణాళికలు రూపొందించారు.
హైడ్రోజన్ ఆధారిత రైళ్ల నిర్వహణ ఖర్చు గురించి ఇంకా స్పష్టత రానప్పటికీ, ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. హైడ్రోజన్ రైళ్ల సంఖ్య పెరిగే కొద్దీ ఖర్చు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.
ఆర్థికపరమైన అంశాలతో పాటు, హైడ్రోజన్ ఇంధనం వల్ల పర్యావరణానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కర్బన ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది. హైడ్రోజన్ ఆధారిత రవాణాకు కేంద్రం ఇస్తోన్న ప్రోత్సాహం రైల్వేకు మాత్రమే పరిమితం కాలేదు.
2024లో పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఇండియన్ ఆయిల్ అభివృద్ధి చేసిన హైడ్రోజన్ ఇంధనంతో నడిచే బస్సును భూటాన్ ప్రధాన మంత్రి షేరింగ్ తోబ్గేకు బహుమతిగా అందజేశారు.