ప్రతి పండుగ, పార్టీ, వేడుక, విజయానందం ఇప్పుడు ఒక్క మాటతో చెప్పాలంటే చియర్స్! అనే పదంతో మొదలవుతోంది. ఒకప్పుడు పరిమిత వర్గంలో మాత్రమే కనిపించిన మద్యం సంస్కృతి నేటి యువతలో ‘ఫ్యాషన్ సింబల్’గా మారిపోయింది. కానీ ఈ సరదా క్రమంగా సమాజానికి పెద్ద ప్రమాద సంకేతంగా మారుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇటీవల వెలువడిన సమగ్ర నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా సుమారు 16 కోట్ల మంది ప్రజలు మద్యం సేవిస్తున్నారు. అందులో 6 కోట్ల మంది ఇప్పటికే దానికి పూర్తిగా బానిసలయ్యారని అంచనా. వయస్సు పరంగా చూస్తే, 18 నుంచి 49 సంవత్సరాల మధ్యవారు ఎక్కువగా బానిస అయిపోతున్నారు.
మద్యం వినియోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలుగు రాష్ట్రాలు కూడా ముందే ఉన్నాయి.
తెలంగాణ మూడవ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ నాలుగవ స్థానంలో నిలిచాయి. అగ్రస్థానం కర్ణాటకదే కాగా, తమిళనాడు రెండో స్థానంలో ఉంది.
ఈ ర్యాంకులు కేవలం గణాంకాలు కావు — ప్రజల జీవన విధానం, యువత దిశపై లోతైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
మద్యపాన అలవాటు వ్యక్తిగత సమస్యగా మొదలై, కుటుంబాల మధ్య విభేదాలకు దారితీస్తోంది. అనేక చోట్ల ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి.
పేద కుటుంబాల్లో ఆదాయం లో సగం వరకు మద్యం మీదే ఖర్చవుతుంది. ఆ తర్వాతి దశలో ఆహారం, విద్య తదితర వాటిపై ఖర్చు చేస్తున్నారు అని సామాజిక కార్యకర్తలు చెప్పుకొస్తున్నారు.
డాక్టర్ల ప్రకారం, నిరంతర మద్యం వినియోగం లివర్, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని మూడు రెట్లు పెంచుతుంది. అదే సమయంలో మానసిక స్థిరత్వం, పనితీరు కూడా తీవ్రంగా దెబ్బతింటాయి. ఒక వ్యక్తి వ్యసనానికి బానిసైతే, కుటుంబం మొత్తం బాధపడుతుంది. ఇది కేవలం ఆరోగ్య సమస్య కాదు సామాజిక సమస్య” అని వైద్యులు చెబుతున్నారు.
మద్యం నిషేధం అనే పదం చట్టపరంగా సులభమైనది కాదు. కానీ నియంత్రణ మాత్రం సాధ్యమే.
ప్రభుత్వం స్థాయిలో కఠిన నియమాలు, అవగాహన కార్యక్రమాలు, విద్యాసంస్థల్లో కౌన్సెలింగ్ ప్రారంభించడం అవసరం. అదే సమయంలో కుటుంబ సభ్యులు కూడా మాట్లాడటం, అర్థం చేసుకోవడం, సహకరించడం వంటి చర్యలే దీర్ఘకాలిక పరిష్కారం.
ప్రతి సారి మద్యం గ్లాసు ఎత్తే ముందు ఒకసారి ఆలోచించాలి.. ఆ సరదా క్షణం మన భవిష్యత్తును చీకటిలోకి నెట్టేస్తుందేమో అని. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి, విద్య, ఐటీ రంగాల్లో ముందంజలో ఉన్నా, ఈ అలవాటు వాటి ప్రతిష్ఠను దెబ్బతీయొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మద్యం సమస్యను సమాజం మొత్తం కలిసి ఎదుర్కోవాలసిన సమయం ఇది.