నేటి డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మన జీవితంలో ప్రతి భాగంగా మారిపోయింది. ప్రశ్న అడిగినా, సమాధానం చెప్పినా, ఫోటో డిజైన్ చేసినా, ఏదైనా డేటా విశ్లేషించినా — AI సాయమే కీలకం. కానీ ఈ సౌకర్యం వెనుక ఉన్న ప్రమాదాలపై నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. “AI ఏది అడిగినా సమాధానం చెబుతుంది” అనే నమ్మకం తప్పుదోవ పట్టించవచ్చని చెబుతున్నారు. ఎందుకంటే కొన్ని విషయాల్లో ఇది ఇచ్చే సమాధానాలు తప్పు మాత్రమే కాకుండా, తీవ్రమైన పరిణామాలకు దారితీయవచ్చు. అందుకే ఐదు కీలక రంగాల్లో AI సలహాలను నమ్మరాదు అని నిపుణులు సూచిస్తున్నారు.
మొదటగా ఆరోగ్య సమస్యలు, మందులు, మానసిక వైద్యం వంటి విషయాల్లో AI సమాధానాలపై ఆధారపడటం ప్రమాదకరం. ఉదాహరణకు, “తలనొప్పి వస్తోంది — ఏ మందు వాడాలి?” లేదా “డిప్రెషన్ నుంచి బయటపడటానికి ఏం చేయాలి?” వంటి ప్రశ్నలు AI ని అడగటం సరైంది కాదు. AI కి మానవ శరీర నిర్మాణం, వ్యాధుల స్వభావం, లేదా వ్యక్తిగత మానసిక స్థితిపై అవగాహన ఉండదు. దాని సలహా తప్పుగా ఉంటే ప్రాణాంతక పరిణామాలు సంభవించవచ్చు. మానసిక ఆరోగ్యానికి కౌన్సిలర్లు, డాక్టర్లు మాత్రమే సరైన మార్గదర్శకులు. కాబట్టి వైద్య, మానసిక సమస్యలపై ఎల్లప్పుడూ నిపుణులను మాత్రమే సంప్రదించాలి.
ఇక ఆర్థిక వ్యవహారాలు, స్టాక్ మార్కెట్ సలహాలు, పెట్టుబడులు వంటి విషయాల్లో కూడా AI సలహాలను నమ్మకూడదు. మార్కెట్లు ఎప్పటికప్పుడు మారుతాయి. AI సమాధానాలు ప్రస్తుత పరిస్థితులను పూర్తిగా ప్రతిబింబించకపోవచ్చు. “ఈ షేర్‌లో పెట్టుబడి మంచిదా?” లేదా “SIP ప్రారంభించాలా?” వంటి ప్రశ్నలకు AI ఇచ్చే సమాధానాలు ఊహాజనితమైనవే. ఇవి ఆర్థిక నష్టాలకు కారణం కావచ్చు. అందుకే ఈ రంగాల్లో అర్హత కలిగిన ఫైనాన్షియల్ సలహాదారుల మార్గదర్శకత్వం అవసరం. అదే విధంగా న్యాయపరమైన విషయాలు కూడా క్లిష్టమైనవే. “ఈ కేసులో శిక్ష ఎంత?” లేదా “దీనికి చట్టం ఏమంటుంది?” అనే ప్రశ్నలకు AI ఇచ్చే సమాధానాలు అసంపూర్ణంగా లేదా తప్పుగా ఉండే అవకాశం ఉంది. న్యాయ సలహాల కోసం లాయర్లనే ఆశ్రయించాలి.
మరొక ముఖ్య అంశం వ్యక్తిగత వివరాలు మరియు డేటా గోప్యత. మన వ్యక్తిగత సమాచారం — బ్యాంకు వివరాలు, ఐడీ నంబర్లు, చిరునామాలు — AIకి చెప్పడం అత్యంత ప్రమాదకరం. ఈ సమాచారం సైబర్ మోసగాళ్లకు చేరే అవకాశం ఉంది. AI సిస్టమ్స్ డేటాను భద్రంగా ఉంచుతాయని హామీ లేదు. కాబట్టి, మన ప్రైవేట్ వివరాలను ఎప్పటికీ AIతో పంచుకోకూడదు. మొత్తంగా, AI అనేది మానవ జీవితాన్ని సులభతరం చేసే శక్తివంతమైన సాధనం అయినప్పటికీ, దాని పరిమితులను అర్థం చేసుకోవాలి. ఆరోగ్యం, మానసిక స్థితి, ఆర్థిక వ్యవహారాలు, న్యాయ సలహాలు లేదా వ్యక్తిగత సమాచారం వంటి కీలక అంశాల్లో మాత్రం AI కాకుండా మానవ నిపుణులే నిజమైన భద్రత అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.