ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామిక రంగాభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ప్రభుత్వం ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు, తక్కువ ధరలకే భూకేటాయింపులు అందిస్తూ, అంతర్జాతీయ సంస్థలను ఏపీలోకి ఆహ్వానిస్తోంది. ముఖ్యంగా విశాఖపట్నం నగరాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ఇప్పటికే విశాఖలో పలు ఐటీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించాయి. కొత్త పెట్టుబడులు, ప్రాజెక్టులు వరుసగా రావడంతో విశాఖ రియల్ ఎస్టేట్ రంగం వేగంగా పుంజుకుంది.
తూర్పు తీరంలో డేటా స్టోరేజ్, టెక్నాలజీ రంగాల్లో ప్రధాన కేంద్రంగా విశాఖపట్నం రూపాంతరం చెందుతోంది. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ తరలువాడ, అడవివరం, రాంబిల్లి ప్రాంతాల్లో 1 గిగావాట్ డేటా సెంటర్ క్లస్టర్‌ను నిర్మిస్తోంది. ఏపీ ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం, గూగుల్ ఈ ప్రాజెక్టులో రూ.87,520 కోట్ల పెట్టుబడి పెడుతోంది. ఈ పెట్టుబడిని వచ్చే ఐదేళ్లలో రూ.1.33 లక్షల కోట్లకు పెంచే ప్రణాళిక కూడా ఉంది. దీంతో విశాఖలో భారీ ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి.
గూగుల్‌తో పాటు సిఫీ టెక్నాలజీస్ కూడా విశాఖలో తన డేటా సెంటర్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇటీవల మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా సిఫీ ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు శంకుస్థాపన జరిగింది. ఈ ల్యాండింగ్ స్టేషన్ ద్వారా భారతదేశం, సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, థాయిలాండ్ వంటి దేశాల మధ్య వేగవంతమైన డేటా కనెక్టివిటీ సాధ్యమవుతుంది. అదే సమయంలో మెటా సంస్థ (ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ) కూడా తన అండర్ సీ కేబుల్ ప్రాజెక్ట్ “వాటర్‌వర్త్” కోసం విశాఖపట్నంను ల్యాండింగ్ సైట్‌గా ఎంచుకుంది. మెటా డేటా సెంటర్ ప్రాజెక్టు ద్వారా విశాఖకు రూ.1 లక్ష కోట్లు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా.
ఇక అదానీ గ్రూప్ కూడా వెనుకాడలేదు. రాష్ట్ర ప్రభుత్వం అదానీ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్క్‌కు భూమిని కేటాయించగా, ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే పర్యావరణ అనుమతి లభించింది. దీని ద్వారా రూ.20,000 కోట్ల పెట్టుబడి వస్తుందని అంచనా. మరోవైపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు వేగంగా సాగుతుండటంతో పాటు, పలు హోటళ్లు, టూరిజం ప్రాజెక్టులు, స్టీల్, ఫార్మా కంపెనీల రాకతో విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో రియల్ ఎస్టేట్ రంగం ఉధృతమవుతోంది. నక్కపల్లి నుంచి శ్రీకాకుళం వరకు సాగరతీర ప్రాంతాల్లో భూముల ధరలు పెరుగుతూ, పెట్టుబడిదారులకు కొత్త అవకాశాలు సృష్టిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ నిపుణుల అంచనా ప్రకారం, గూగుల్, మెటా, అదానీ ప్రాజెక్టులు పూర్తయ్యేసరికి ఉత్తరాంధ్ర తూర్పు తీర మొత్తం “నెక్ట్స్ బిగ్ ఇన్వెస్ట్‌మెంట్ కారిడార్”గా మారనుంది.