ప్రపంచ వేదికపై అన్ని రంగాల్లో పోటీకి సిద్ధమవుతున్న భారత్, పరిశోధన, నూతన ఆవిష్కరణలలోనూ అదే వేగాన్ని కొనసాగించడానికి ప్రత్యేక కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ‘ఇండియా రీఇమాజిన్డ్ ఫెలోషిప్’ (India Reimagined Fellowship) ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని పరిశోధన సంస్థలు, విశ్వవిద్యాలయాలు ప్రపంచ స్థాయి నిపుణులు, శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు, ఆవిష్కర్తలను ఆకర్షించవచ్చు. బయోమెడికల్ సైన్స్, ప్రజారోగ్య సవాళ్లు, నూతన టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేయగలవారికి కేంద్రం ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది. ఈ ఫెలోషిప్ BFI (Blockchain for Impact) ఆధ్వర్యంలో కొనసాగుతుంది.
ఈ ఫెలోషిప్‌లో ఎంపికైన అభ్యర్థులకు మూడు సంవత్సరాల కాలానికి గాను 3 లక్షల డాలర్లు, సుమారు 2.5 కోట్లు గ్రాంట్‌గా అందిస్తారు. భారతీయులైతే గానీ, అంతర్జాతీయ నిపుణులైతే గానీ భారత్‌లోని హోస్ట్ సంస్థల్లో చేరి పరిశోధన చేయడానికి అవకాశం లభిస్తుంది. ఫెలోషిప్‌కు వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోవడం లేదు. కేవలం పరిశోధన సంస్థలు, విశ్వవిద్యాలయాలు తమ అభ్యర్థులను నామినేట్ చేయాలి. ఇలా చేయడం వల్ల అభ్యర్థికి ఆ సంస్థ మద్దతు, నూతన ప్రాజెక్ట్‌లో జవాబుదారీతనం లభిస్తుంది, అలాగే పరిశోధనా ఫలితాల పట్ల బాధ్యత పెరుగుతుంది.
బీఎఫ్ఐ ఈ ఫెలోషిప్ ద్వారా కేవలం మూడు అత్యుత్తమ నిపుణులను మాత్రమే ఎంపిక చేయనుంది. ఎంపికైన ప్రతి ఫెలోకు నిధులు మూడు దఫాలుగా విడుదల చేయబడతాయి. ప్రతి సంవత్సరం సుమారు 1 లక్ష డాలర్లు, అంటే సుమారు 88 లక్షలు రూపాయలు, ఫెలో పరిశోధన, ప్రయోగశాల ఖర్చులు, జీతాలు, పరికరాల కొరకు హోస్ట్ సంస్థకు అందజేస్తారు. చివరి విడత నిధులు పూర్తయిన పరిశోధన నివేదికల ఆధారంగా నిపుణుల కమిటీ సమీక్షించిన తర్వాతే విడుదల అవుతుంది. ఈ విధానం ఫెలోషిప్ నిధుల సమర్థవంతమైన వినియోగాన్ని నిర్ధారిస్తుంది.
హోస్ట్ సంస్థగా అర్హత పొందేందుకు FCRA (Foreign Contribution Regulation Act) అంచనాలు పూర్తి చేయడం తప్పనిసరి. హోస్ట్ సంస్థ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేక ఖాతా ఏర్పాటుచేయాలి, వార్షిక పురోగతి నివేదికలు మరియు ఆర్థిక వివరాలు సమర్పించాలి. దరఖాస్తుకు తుది గడువు 2026 జనవరి 31గా నిర్ణయించబడింది. హోస్ట్ సంస్థ దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థుల రెజ్యూమే, రీసెర్చ్ ప్రపోజల్, రికమెండేషన్ లెటర్స్, ఇన్‌స్టిట్యూషనల్ కమిట్‌మెంట్ లెటర్స్ India.reimagined@blockchainforimpact.nl కు ఈమెయిల్ చేయాలి. ఈ ఫెలోషిప్ భారతదేశంలో పరిశోధన మరియు నూతన ఆవిష్కరణల ప్రాధాన్యతను మరింతగా పెంపొందించడానికి కేంద్రం తీసుకుంటున్న కీలక ప్రయత్నాలలో ఒకటిగా భావించవచ్చు.