విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం చివరి దశకు చేరుకుంది. డిసెంబర్ చివరి వారం లేదా జనవరి మొదటి వారంలో టెస్ట్ ఫ్లైట్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం 92% పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు కూడా త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది జూన్ నాటికి విమానాశ్రయాన్ని పూర్తిగా సిద్ధం చేయడం, అలాగే ఆగస్టులో విమాన రాకపోకలు ప్రారంభించడం ప్రభుత్వ లక్ష్యం. ఈ విమానాశ్రయం ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ పేరుతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా మారనుంది.
రన్‌వే నిర్మాణం దాదాపుగా పూర్తయింది. 3.8 కి.మీ రన్‌వేలో 99%, ట్యాక్సీవేలో 98%, టెర్మినల్ భవనంలో 90%, ఏటీసీ టవర్‌లో 72%, ఇతర భవనాల్లో 43%, ప్రధాన రహదారి పనుల్లో 37% పూర్తి చేశారు. ఈ విమానాశ్రయాన్ని ముంబై, నోయిడా వంటి అత్యాధునిక విమానాశ్రయాల సరసన నిలిచేలా నిర్మిస్తున్నారు. ప్రత్యేకత ఏమిటంటే—ఇది చేప ఆకారంలో ఉండేలా డిజైన్ చేశారు. పై నుంచి చూస్తే మత్స్యాకారంలో కనిపిస్తుంది.
ఈ విమానాశ్రయం పూర్తయ్యే సరికి ఉత్తరాంధ్ర రవాణా సౌకర్యాలు భారీగా మెరుగుపడతాయి. విశాఖలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు విశాఖ పోర్టు–మూలపేట పోర్టు మధ్య కొత్త కనెక్టివిటీ రహదారి నిర్మాణం కూడా ప్రణాళికలో ఉంది. అదేవిధంగా అనకాపల్లి, విజయనగరం మీదుగా ఈ విమానాశ్రయాన్ని ప్రధాన రహదారులకు కలుపుతున్నారు. విశాఖ నుంచి భోగాపురం వరకు మెట్రో రైలు ప్రాజెక్ట్ కూడా కొనసాగుతోంది. పర్యాటక అభివృద్ధి కోసం 500 ఎకరాల భూమిని కేటాయించి, తాజ్ గ్రూప్ హోటల్ కూడా రావడానికి సిద్ధమవుతోంది.
భోగాపురం విమానాశ్రయం నిర్మాణం రాష్ట్ర విభజన హామీల్లో భాగమే. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఎంపిక చేసి 2019లో శంకుస్థాపన చేసింది. 2023లో జగన్ ప్రభుత్వం మరోసారి ప్రారంభించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యవేక్షణలో పనులు మరింత వేగంగా సాగుతున్నాయి. సీఎం చంద్రబాబు ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు ప్రకటించారు.
ప్రస్తుతం 5,050 మంది ఇంజనీర్లు, కార్మికులు ఈ నిర్మాణ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ విమానాశ్రయం పూర్తి అయితే పర్యాటకం, వ్యాపారం, రావాణా అన్నీ సెక్టార్ల లో ఉత్తరాంధ్రకు భారీ లాభం కలుగుతుంది. ఉద్యోగాలు పెరుగుతాయి, అంతర్జాతీయ కనెక్టివిటీ మెరుగుపడుతుంది. మొత్తం మీద, భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు భవిష్యత్తు అభివృద్ధికి నూతన ద్వారం కానుంది.