అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు. నదులపై అవగాహన లేకుండా జగన్ (Jagan) దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సింధూ నాగరికత నుంచి నేటి ఆధునిక నగరాల వరకు నదీతీరాలే నాగరికతకు పునాది అని తెలిపారు. ఢిల్లీ, లండన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత నగరాలు కూడా నదుల పక్కనే అభివృద్ధి చెందినవని గుర్తు చేశారు. నదీగర్భం, నదీపరివాహక ప్రాంతం మధ్య తేడా కూడా తెలియకుండా రాజధానిపై విషం చిమ్మడం తగదని ఆయన అన్నారు.
రాష్ట్రంలో వచ్చే రెండేళ్లలో నీటి కొరత లేకుండా పక్కా ప్రణాళికలు సిద్ధం చేశామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నీటి సద్వినియోగం వల్లే రాయలసీమలో ఉద్యానవన (హార్టీకల్చర్) అభివృద్ధి సాధ్యమైందని తెలిపారు. దేశంలో ఉద్యానరంగంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవడానికి సమర్థవంతమైన నీటి నిర్వహణే కారణమన్నారు. నీటి విషయంలో గొడవలకు దిగితే నష్టపోయేది తెలుగు ప్రజలేనని, అందుకే తెలుగు రాష్ట్రాలు రెండూ బాగుండాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు.
పట్టిసీమ ప్రాజెక్టు (Pattiseema Project) రాయలసీమకు నీరిచ్చిన ప్రత్యక్ష ఉదాహరణ అని సీఎం అన్నారు. పట్టిసీమ ద్వారా రాయలసీమ పట్ల తమ చిత్తశుద్ధిని చూపించామని, దాని వల్లే అక్కడ ఉద్యాన పంటలు విస్తరించాయని తెలిపారు. 2020లో రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును నిలిపివేసి స్వార్థ రాజకీయాలు చేశారని ఆరోపించారు. కేవలం మట్టిపనులు చేసి రూ.900 కోట్లు బిల్లులు చేసినా ప్రజలకు ఉపయోగం లేకపోయిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని, నీటి విషయంలో ఎలాంటి రాజీ ఉండదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
పట్టిసీమ ప్రాజెక్టు ప్రాధాన్యత ఏమిటి?
పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీరు అందించి, అక్కడ ఉద్యానవన పంటల అభివృద్ధికి దోహదపడింది.
నీటి నిర్వహణపై ప్రభుత్వం లక్ష్యం ఏమిటి?
వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో నీటి కొరత లేకుండా సమర్థవంతమైన ప్రణాళికలతో ప్రజలకు భరోసా ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం.