అమెరికాలో చౌకైన విదేశీ వ్యవసాయ ఉత్పత్తులు స్థానిక రైతులకు నష్టం కలిగిస్తున్నాయని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన కొత్త సుంకాలు విధించేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా భారతీయ బియ్యం, కెనడియన్ ఎరువులు వంటి దిగుమతులపై అదనపు సుంకాలు విధించే అవకాశాన్ని ట్రంప్ వెల్లడించారు. అమెరికన్ రైతులు దిగుమతి వస్తువుల వల్ల మార్కెట్ ధరలు పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
తన పరిపాలన రైతుల సమస్యలను పట్టించుకుంటోందని చెబుతూ ట్రంప్, అమెరికన్ వ్యవసాయ రంగాన్ని రక్షించేందుకు 12 బిలియన్ డాలర్ల భారీ బెయిలౌట్ ప్యాకేజీని ప్రకటించారు. వైట్ హౌస్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విదేశీ దేశాలు తక్కువ ధరకు బియ్యాన్ని అమెరికా మార్కెట్‌లోకి పంపుతున్నారన్న ఆరోపణలను ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
రైతుల ఒత్తిడి కారణంగా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. సబ్సిడీతో వచ్చే విదేశీ బియ్యం అమెరికా మార్కెట్‌ను ప్రభావితం చేస్తోందని, దేశీయ ధరలు తగ్గుతున్నాయని రైతులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దిగుమతి ఉత్పత్తులపై తీవ్రమైన సుంకాలు విధించే దిశగా అడుగులు వేయనున్నట్లు ట్రంప్ సంకేతాలిచ్చారు.
లూసియానా రాష్ట్రానికి చెందిన కెన్నెడీ రైస్ మిల్ CEO మెరిల్ కెన్నెడీ కూడా సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. భారత్, థాయిలాండ్, చైనా వంటి దేశాలు అమెరికా సుంకాలను ఎదుర్కోనున్న మొదటి దేశాలు కావచ్చని ఆయన తెలిపారు. ముఖ్యంగా చైనా భారీగా బియ్యం ఎగుమతి చేస్తున్నా, అమెరికా ప్రధాన భూభాగానికి కాకుండా ప్యూర్టో రికోకు వెళ్తోందని వివరించారు.
అమెరికా దక్షిణాది ప్రాంతంలోని రైతులు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని కెన్నెడీ అన్నారు. విదేశీ దిగుమతుల పెరుగుదల కారణంగా దేశీయ ఉత్పత్తికి ప్రమాదం ఏర్పడుతున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని, అమెరికా పరిపాలన విదేశీ దిగుమతులపై కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది.