భారత రైల్వేలో ప్రయాణించే చాలా మందికి ఒక సాధారణ సందేహం ఉంటుంది — రైలులో మద్యం బాటిళ్లు తీసుకెళ్లవచ్చా లేదా అనే విషయం. కొందరు పరిమిత పరిమాణంలో తీసుకెళ్లవచ్చని అంటుంటే, మరికొందరు పూర్తిగా నిషేధమని చెబుతారు. ఈ విషయంలో స్పష్టత కోసం సమయం తెలుగు రైల్వే నిబంధనలను పరిశీలించింది.
భారతీయ రైల్వే నియమాల ప్రకారం రైళ్లలో మద్యం బాటిళ్లను తీసుకెళ్లడం లేదా రైలులో మద్యం సేవించడం పూర్తిగా నిషేధం. ఇది ప్రయాణికుల భద్రత, క్రమశిక్షణ, ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండటానికి తీసుకున్న చర్య. రైలులో మద్యం సేవించడం వల్ల అసభ్య ప్రవర్తన, గొడవలు, అసౌకర్యం ఏర్పడే అవకాశం ఉండటంతో రైల్వే శాఖ ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తోంది. విమాన ప్రయాణం లేదా రోడ్డు ప్రయాణంతో పోలిస్తే, రైల్వేలో లిక్కర్‌కు అనుమతి లేదు అని అధికారులు స్పష్టం చేశారు.
ఈ నిబంధనలు కేవలం ప్రయాణికులకే కాకుండా రైల్వే సిబ్బందికి కూడా వర్తిస్తాయి. డ్రైవర్లు, గార్డులు, రన్నింగ్ స్టాఫ్ విధుల్లో ఉన్నప్పుడు మద్యం సేవిస్తే అది రైళ్ల భద్రతకు తీవ్రమైన ముప్పుగా పరిగణిస్తారు. మద్యం సేవించి విధుల్లో హాజరవడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని రైల్వే శాఖ హెచ్చరిస్తోంది. ఈ కారణంగా విధుల్లో మద్యం సేవించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటోంది.
రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 145 ప్రకారం మద్యం సేవించి రైలులో లేదా రైల్వే స్టేషన్ ప్రాంగణంలో అసభ్యంగా ప్రవర్తిస్తే శిక్షలు విధిస్తారు. మొదటిసారి తప్పు చేస్తే రూ.100 జరిమానా విధిస్తారు. అదే తప్పును మళ్లీ చేసినా లేదా అసభ్యంగా ప్రవర్తించి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే ఒక నెల జైలు శిక్ష లేదా రూ.250 జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. రైల్వే సిబ్బందిపై దాడి చేసినా లేదా హింసాత్మకంగా ప్రవర్తించినా గరిష్టంగా ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ.500 జరిమానా విధించవచ్చు.
ప్రయాణికులు సురక్షితమైన, ప్రశాంతమైన ప్రయాణాన్ని ఆస్వాదించాలంటే రైల్వే భద్రతా నియమాలు, ప్రవర్తనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. రైల్లో మద్యం తీసుకెళ్లడం లేదా సేవించడం చట్ట విరుద్ధం మాత్రమే కాదు, ఇతరులకు ఇబ్బంది కలిగించే చర్య కూడా అవుతుంది. అందువల్ల రైల్వే అధికారులు ప్రతి ఒక్కరిని ఈ నియమాలను గౌరవించాలని, సమాజ భద్రత, శాంతి కోసం సహకరించాలని సూచిస్తున్నారు.