డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగదు..
సీఎం రేవంత్ వితండవాదం పక్కనపెట్టాలి..
డీలిమిటేషన్ అంశంపై తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వాదోపవాదాలు చెలరేగాయి. కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదనలను తీవ్రంగా ఖండించారు.
రేవంత్ రెడ్డి సూచించిన హైబ్రిడ్ నమూనా అంబేద్కర్ విధానానికి విరుద్ధమని కిషన్ రెడ్డి అన్నారు. “ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి విధానం లేదు. ఇది పూర్తిగా వాస్తవాలకు విరుద్ధమైన ఆలోచన” అని విమర్శించారు.
రేవంత్ సూచించిన విధంగా అమలు చేస్తే గుజరాత్ వంటి రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు వస్తాయని, అయితే డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పడం సరైంది కాదన్నారు.
తెలంగాణ ఉదాహరణను చూపిస్తూ, “రాష్ట్ర ఆదాయంలో 70 శాతం హైదరాబాద్ నుంచే వస్తోంది. అలాంటప్పుడు అదే ప్రమాణంగా తీసుకుంటే 70 శాతం సీట్లు హైదరాబాద్‌కే ఇవ్వాలా?” అని ప్రశ్నించారు. ఆదిలాబాద్ వంటి ప్రాంతాల నుంచి సీట్లు తగ్గించి నగరాలకు పెంచడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
“చేతనైతే ఈ బిల్లులను సమర్థించండి, లేకపోతే నోరుమూసుకుని కూర్చోండి. కానీ తప్పుడు ప్రచారం చేయొద్దు” అంటూ కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
కాంగ్రెస్ పార్టీ ఈ రెండు బిల్లులకు సహకరించాలని కూడా ఆయన కోరారు. చివరగా, సీట్లు ఎక్కడ పెరిగినా, ప్రజలే ఓటు వేసి నాయకులను గెలిపిస్తారని గుర్తుచేశారు. ఈ వ్యాఖ్యలతో డీలిమిటేషన్ అంశంపై తెలంగాణ రాజకీయాల్లో చర్చ మరింత వేడెక్కింది.