మహానాడు నిర్వహణపై చర్చ, స్థలంపై తుది నిర్ణయం..
పార్టీ కమిటీలపై కీలక నిర్ణయాలు, రాజకీయ వ్యూహాలపై దృష్టి..
మంగలగరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ కీలక సమావేశం జరిగింది. మంత్రి నారా లోకేష్ అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో సమావేశమై, పలు ముఖ్య అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో పాటు మరికొందరు కీలక నేతలు హాజరయ్యారు.
మే నెలలో జరగనున్న మహానాడు నిర్వహణపై ప్రధానంగా చర్చ జరిగింది. మహానాడు కోసం రెండు ప్రదేశాలను టీడీపీ హైకమాండ్ పరిశీలిస్తోంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం, విజయనగరం జిల్లా నెల్లిమర్ల ప్రాంతాలను పరిశీలనలో ఉంచారు.
ఈ రెండు ప్రాంతాల్లో అనుకూలమైన స్థలాలను పరిశీలించాల్సిందిగా రాష్ట్ర అద్యక్షులు పల్లా శ్రీనివాస రావు కు లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 17న మహానాడు నిర్వహణ స్థలంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
మహానాడు ముందు టీడీపీ రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ, పోలిట్ బ్యూరో సభ్యులను ఖరారు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. పోలిట్ బ్యూరోలో కీలక మార్పులు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
మండల స్థాయి నాయకులకు కూడా పోలిట్ బ్యూరోలో చోటు కల్పించే దిశగా పార్టీ ఆలోచన చేస్తున్నట్లు చర్చల్లో వెల్లడైంది. దీంతో పార్టీ నిర్మాణంలో కొత్త మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజా రాజకీయ పరిణామాలపై కూడా సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. భవిష్యత్ రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మరింత బలమైన వ్యూహాలు సిద్ధం చేయాలని నిర్ణయించారు.
ఈ సమావేశం టీడీపీ భవిష్యత్ కార్యాచరణకు దిశానిర్దేశం చేసేలా సాగింది. పార్టీని బలోపేతం చేయడం, మహానాడు విజయవంతం చేయడం లక్ష్యంగా నేతలు ముందుకు సాగుతున్నారు.