కెనడా ప్రభుత్వం ఇటీవల తాత్కాలిక వీసాలు స్టడీ పర్మిట్లు, వర్క్ పర్మిట్లు మరియు eTA ల రద్దుపై కొత్త నియమాలను ప్రకటించింది. నవంబర్ 4, 2025న ఇమ్మిగ్రేషన్, రిఫ్యూజీలు అండ్ సిటిజన్షిప్ కెనడా (IRCC) విడుదల చేసిన ఈ మార్గదర్శకాలు, ఏ సందర్భాల్లో వీసా లేదా పర్మిట్ రద్దు అవుతుందో స్పష్టంగా చెబుతున్నాయి.
ఇప్పటి వరకు అధికారులు రద్దు నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని కలిగి ఉన్నప్పటికీ దాని మీద స్పష్టమైన నిబంధనలు లేకపోవడం గందరగోళానికి దారితీసేది. కొత్త నియమాలతో ఆ అనిశ్చితి తొలగిపోయి, ప్రతి పర్మిట్‌కు స్పష్టమైన చట్టపరమైన ఆధారాలు ఇవ్వబడ్డాయి.
సందర్శకుల వీసాలు (Visitor Visas) రద్దు అయ్యే పరిస్థితులను 180.1 మరియు 180.2 సెక్షన్లలో వివరించారు. ఎవరి అర్హతలు మారినా, వారు దేశంలో ఉండటానికి అనర్హులయ్యినా, తప్పుడు సమాచారంతో వీసా పొందినా లేదా పరిపాలనా పొరపాటుతో వీసా జారీ అయినా వీసా రద్దు చేసేందుకు అధికారులకు అధికారాలు ఉన్నాయి.
ఈ వీసా ఆటోమేటిక్‌గా కూడా రద్దు కావచ్చు. ఉదాహరణకు, వీసా కలిగిన వ్యక్తి కెనడాలో శాశ్వత నివాసం పొందితే లేదా వీసా ఉన్న పాస్పోర్టు పోయినా, గడువు ముగిసినా వీసా స్వయంగా అమాన్యమవుతుంది. ఇలాంటి స్పష్టత గతంలో లేనందున అనేక సందేహాలు వచ్చేవి.ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (eTA) కూడా ఇలాంటి నిబంధనల ఆధారంగా రద్దు చేయవచ్చు. 12.07 మరియు 12.08 సెక్షన్లలో eTA రద్దుకు కారణాలు సూచించారు.
నేరచరిత్ర బయటపడినా, పాస్పోర్టు వివరాలు మారినా, లేదా పొరపాటుతో eTA జారీ అయ్యినా అధికారులు దానిని తక్షణమే రద్దు చేయవచ్చు. ఉదాహరణకు, ఒక ఫ్రెంచ్ ప్రయాణికుడు eTA పొందిన తర్వాత తీవ్రమైన నేరంలో దోషిగా తేలితే, ఆ eTA వెంటనే రద్దు అవుతుంది. అలాగే పాస్పోర్టు రీన్యువల్ చేయడంతో పాత పాస్పోర్టుకు లింక్ అయిన eTA ఆటోమేటిక్‌గా పనిచేయదు.
స్టడీ పర్మిట్ మరియు వర్క్ పర్మిట్‌లకు కూడా కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. స్టూడెంట్ పర్మిట్ రద్దుకు సంబంధించిన నియమాలు 222.7, 222.8 సెక్షన్లలో ఉన్నాయి. స్టడీ పర్మిట్ పొరపాటుతో జారీ అయ్యినా ఆ విద్యార్థి చదువుతున్న కళాశాల లేదా విశ్వవిద్యాలయం IRCC గుర్తింపు జాబితా (DLI) నుంచి తొలగించబడినా ఆ పర్మిట్ రద్దు అయ్యే అవకాశం ఉంది.
వర్క్ పర్మిట్ విషయంలో 209.01 మరియు 209.02 సెక్షన్లు అమల్లో ఉన్నాయి. ఉద్యోగదారుడు నిబంధనలకు అనుగుణంగా లేకపోతే లేదా LMIA వంటి పత్రాల్లో లోపాలు ఉంటే వర్క్ పర్మిట్ రద్దు చేసే అధికారం అధికారులకు ఉంటుంది.ఇవి అంతా చేసినప్పటికీ, కొన్ని సందర్భాల్లో మాత్రం పర్మిట్ రద్దు చేయరాదు.
ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో మానవతా దృక్కోణంతో ఇచ్చిన పర్మిట్‌లు ప్రత్యేక సడలింపులపై ఇచ్చిన స్టడీ లేదా వర్క్ పర్మిట్‌లు ఈ రద్దు నిబంధనలకు వర్తించవు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో సహాయం పొందిన వారికి భయపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది.
ఈ కొత్త నియమాలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో కెనడాలో తాత్కాలికంగా ఉండే విద్యార్థులు, ఉద్యోగస్తులు, సందర్శకులు మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. వారి పాస్పోర్టు, వీసా వివరాలు ఎప్పటికప్పుడు సరిచూసుకోవడం, సంస్థల అర్హతలను ధృవీకరించుకోవడం, ఎటువంటి తప్పుడు పత్రాలు ఉపయోగించకపోవడం అవసరం.
గత కొన్నేళ్లుగా కెనడా ప్రభుత్వం తాత్కాలిక నివాసితుల సంఖ్యను నియంత్రించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ తాజా మార్పులు కూడా ఆ ప్రణాళికలో భాగమే. వీసా మోసాలు, పత్రాల తారుమార్లు, దేశంలో అనధికారికంగా మిగిలిపోవడాన్ని తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.
నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ విధానం వీసా ప్రక్రియలో పారదర్శకతను పెంచడంతో పాటు నిజాయితీగా చదువు, ఉద్యోగం కోసం వెళ్లే వారికి స్పష్టమైన మార్గదర్శకాలను ఇస్తుంది. అయితే నియమాలు మరింత కఠినం కావడం వల్ల కొంత ఒత్తిడి కూడా ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. అయినప్పటికీ కెనడాలో అంతర్జాతీయ విద్యార్థులు మరియు ఉద్యోగస్తుల ప్రవేశాన్ని సరైన దారిలో నడిపించేందుకు ఈ నియమాలు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.
Canada visa: కెనడా వీసా వ్యవస్థలో పెద్ద మార్పులు సందర్శక–స్టడీ–వర్క్ పర్మిట్ రద్దుకు కొత్త నియమాలు!!