బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం..
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక..
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారుతున్నాయి. ఉత్తర శ్రీలంక తీర ప్రాంతం, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం అదే ప్రాంతంలో కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ అల్పపీడనం వచ్చే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
ఈ ప్రభావంతో మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని తెలిపారు.
వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో బహిరంగ ప్రదేశాల్లో తిరగవద్దని, సురక్షిత భవనాల్లోనే ఆశ్రయం పొందాలని హెచ్చరించింది. పాత భవనాలు, భారీ హోర్డింగ్స్ దగ్గర నిలబడకూడదని సూచించారు. రైతులు వ్యవసాయ పనుల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, పొలాల్లో పనిచేస్తున్న వారు, పశుకాపరులు ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. చెట్ల కింద నిలబడరాదని కూడా విజ్ఞప్తి చేశారు.
మరోవైపు రాష్ట్రంలోని కొండ ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం కనిపించే అవకాశముందని అధికారులు తెలిపారు. అల్లూరి జిల్లా జీకే వీధి, ముంచింగిపుట్టు, పెదబయలు మండలాలతో పాటు పోలవరం జిల్లా చింతూరు, కూనవరం, మారేడుమిల్లి, వరరామచంద్రాపురం, గుర్తేడు ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు.
ఇక రాష్ట్రంలో ఎండల తీవ్రత కూడా కొనసాగుతోంది. సోమవారం నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పులో 42.3 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరంలో 42.1 డిగ్రీలు నమోదయ్యాయి. కర్నూలు జిల్లా మంత్రాలయంలో 41.5 డిగ్రీలు, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 41.4 డిగ్రీలు, కడపలో 41.3 డిగ్రీలు నమోదయ్యాయి.
అలాగే పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిలో 41.2 డిగ్రీలు, పల్నాడు జిల్లా అచ్చంపేటలో 40.9 డిగ్రీలు, అనంతపురం జిల్లా రాయదుర్గంలో 40.8 డిగ్రీలు, కృష్ణా జిల్లా పెద్దపారుపూడి, నంద్యాల జిల్లా దొర్నిపాడులో 40.7 డిగ్రీలు నమోదయ్యాయి. మర్కాపురం జిల్లా నందనమారెళ్లలో 40.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాల హెచ్చరికలతో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచిస్తోంది.