తీవ్ర ఎండలు ఉండగా, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు..
తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి..
ఆంధ్రప్రదేశ్లో రాబోయే మూడు రోజుల పాటు మిశ్రమ వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఎండలు ఉండగా, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.
విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో మంగళవారం (మే 5) మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
వర్షాల సమయంలో రైతులు, కూలీలు, పశు కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా ఉరుములు, పిడుగులు పడేటప్పుడు చెట్ల కింద నిలబడకూడదని హెచ్చరించారు.
ఇక మరోవైపు కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత కూడా కొనసాగనుంది. ఉక్కపోత, వేడి కారణంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సోమవారం నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా అధికంగానే ఉన్నాయి. కృష్ణా జిల్లా పెద్దపారుపూడిలో 43.9°C, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పులో 43.1°C, నంద్యాల జిల్లా దొర్నిపాడులో 42.9°C నమోదయ్యాయి. మార్కాపురం పెద్దదోర్నాల, నెల్లూరు గూడూరు, శ్రీకాకుళం తామాడలో 42.7°C, కడప జమ్మలమడుగులో 42.6°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అలాగే ఏలూరు ధర్మాజీగూడెంలో 42.2°C, కర్నూలు మంత్రాలయంలో 42°C, అనంతపురం తెరన్నపల్లిలో 41.9°C, పల్నాడు అమరావతిలో 41.8°C నమోదయ్యాయి. చిత్తూరు తవణంపల్లెలో 41.6°C, గుంటూరులో 41.3°C, ప్రకాశం మర్రిపూడిలో కూడా 41.3°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 16 జిల్లాల పరిధిలోని 74 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదై ఎండ తీవ్ర ప్రభావం కనిపించిందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాలు ఉండే పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది.