ఈదురుగాలులు, వర్షాలతో విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది..
విద్యుత్ ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి హెచ్చరిక..
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం కలిగిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. కొన్నిచోట్ల వర్షం తీవ్రత ఎక్కువగా ఉండటంతో విద్యుత్ పునరుద్ధరణ పనులకు ఆలస్యం జరుగుతోందని చెప్పారు. అయితే మధ్యాహ్నంలోగా ఎక్కువ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు.
విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది నిరంతరం ఫీల్డ్‌లో పనిచేస్తున్నారని మంత్రి తెలిపారు. ఏ ప్రాంతంలో ఏ సమస్య ఉందో, దాన్ని పరిష్కరించడానికి ఎంత సమయం పడుతుందో అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఈదురుగాలులు, భారీ వర్షాల కారణంగా పలుచోట్ల ఫీడర్లు డౌన్ కావడంతో సాంకేతిక సమస్యలు తలెత్తాయని పేర్కొన్నారు.
ప్రజలు విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు. ముఖ్యంగా తెగిపోయిన విద్యుత్ తీగలు, విద్యుత్ స్తంభాల దగ్గరికి వెళ్లొద్దని హెచ్చరించారు. ప్రజలకు జాగ్రత్త సూచనలు అందేలా అప్రమత్త సందేశాలు జారీ చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
విద్యుత్ సరఫరా లేదా ఇతర సమస్యలపై ప్రజలు 1912 టోల్ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించాలని మంత్రి సూచించారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు.
ఇదిలా ఉండగా, విజయవాడలో విద్యుత్ తీగ తెగిపడి ఒక హోంగార్డు మృతి చెందిన ఘటనపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయం అందజేస్తామని తెలిపారు.
వర్షాలు, గాలుల కారణంగా పనులకు ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ విద్యుత్ శాఖ సిబ్బంది నిరంతరం సేవలందిస్తున్నారని మంత్రి అభినందించారు. ప్రజలు కూడా సహకరించి అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.