తమిళనాడు తీర ప్రాంతంలో డిట్‌వా తుఫాన్ ప్రభావం తీవ్రమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి అప్రమత్తం . తుఫాన్ ప్రస్తుతం తమిళనాడు తీరానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో కదులుతూ ఉత్తర దిశగా బలహీన స్థితిలో ప్రయాణిస్తున్నట్లు వాతావరణ విభాగం తాజా నివేదికలో వెల్లడించింది. అయినప్పటికీ తుఫాన్‌కు అనుబంధంగా ఏర్పడిన అతి భారీ వర్షాలు, గాలివానలు పలు ప్రాంతాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
ఇండియా మెటీరియాలజికల్ డిపార్ట్‌మెంట్ (IMD) తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ ఆంధ్ర తీరం రాయలసీమలో కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. సాయంత్రానికి 90 కిలోమీటర్ల వేగంతో వీచుతున్న గాలులు 60 కిలోమీటర్ల వేగానికి తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, వర్షపాతం తీవ్రత మాత్రం కొనసాగుతుందని అంచనా.
కడలూరు, నాగపట్టణం, మయిలాడుతురై, విల్లుపురం, చెంగల్పట్టు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో అత్యధిక వర్షం పడే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. చెన్నై సహా రాష్ట్ర అంతర్గత జిల్లాలకు కూడా పసుపు అలర్ట్ జారీ చేసి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సముద్ర తీరాల్లో అలలు పెరగడం వల్ల చేపల వేటను పూర్తిగా నిలిపివేశారు. తక్కువ ఎత్తున్న తీర గ్రామాల ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులను స్థానిక పరిపాలన వేగవంతం చేసింది.
తుఫాన్ సమయంలో ప్రజలు అనుసరించాల్సిన జాగ్రత్తలపై కూడా ప్రభుత్వం అవగాహన పెంచుతోంది. ముఖ్యంగా ఇళ్లలో బలహీనమైన కిటికీలు, తలుపులు, పైకప్పులను ముందే బిగించుకోవాలని సూచించింది. నీటి నిల్వలు, ఎలక్ట్రిక్ తీగలు, కూలిపోయే అవకాశం ఉన్న చెట్లు, బోర్డులు వంటి ప్రమాదకర పరిస్థితుల నుంచి దూరంగా ఉండాలని హెచ్చరించింది. ఇంట్లో ఉండే వారికి ప్రధాన విద్యుత్ సరఫరా నిలిపివేయడం, తలుపులు కిటికీలు బిగించడం, అత్యవసర కాంతి పరికరాలు సిద్ధంగా ఉంచుకోవడం వంటి చర్యలు అవసరమని అధికారులు చెబుతున్నారు.
తుఫాన్ సమయంలో పాడుబడిన భవనాలు, కూలిన విద్యుత్ స్తంభాలు, నీరు నిలిచిన ప్రదేశాలకు దూరంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. తేలికపాటి వస్తువులు గాలిలోకి ఎగిరే ప్రమాదం ఉండటంతో వాటిని ముందే సురక్షితంగా ఉంచాలని సూచించారు. తుఫాన్ తర్వాత కూడా వెంటనే ఇళ్లకు తిరిగి వెళ్లకూడదని, అధికారుల అనుమతి వచ్చిన తర్వాత మాత్రమే కదలికలు ప్రారంభించాలని ప్రజలకు సూచించారు.
తమిళనాడు పుదుచ్చేరి, ఆంధ్ర రాష్ట్రాల్లో ఇప్పటికే సహాయక బృందాలు, SDRF సిబ్బంది, విపత్తు నిర్వహణ దళాలు అలర్ట్‌లోకి వచ్చాయి. ఎన్డీఆర్‌ఎఫ్ కూడా అవసరమైతే అదనపు బృందాలను పంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.