తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త అందించింది. 2026 మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల కోటాను డిసెంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి ప్రముఖ ఆర్జిత సేవల టికెట్లు ఈసారి కూడా ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో కేటాయించనున్నారు. భక్తులు డిసెంబర్ 18 ఉదయం నుంచి డిసెంబర్ 20 ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం ఉంది.
ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా టికెట్లు పొందిన భక్తులు డిసెంబర్ 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు టికెట్ రుసుము చెల్లించి తమ బుకింగ్‌ను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత సమయానికి రుసుము చెల్లించని పక్షంలో టికెట్లు స్వయంచాలకంగా రద్దవుతాయని టీటీడీ స్పష్టం చేసింది. ఆర్జిత సేవల టికెట్లకు భక్తుల నుంచి విపరీతమైన డిమాండ్ ఉండటంతో, సమయానికి నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇతర ముఖ్యమైన సేవల టికెట్లను కూడా దశలవారీగా విడుదల చేయనున్నారు. డిసెంబర్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవల టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు. వర్చువల్ సేవల ద్వారా భక్తులు ఇంటి నుంచే శ్రీవారి సేవల్లో పాల్గొనే అవకాశం కలుగుతుంది.
డిసెంబర్ 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు. వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్లను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంచుతారు. ఇక రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను డిసెంబర్ 24న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలోని వసతి గదుల కోటాను విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు టికెట్ల బుకింగ్ కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.