- పర్సంటేజీ విధానం అనుమతించిన సినిమాలనే ప్రదర్శిస్తామన్న ఎగ్జిబిటర్లు..
- Cinema: పెద్ది సినిమా విడుదలకు ముందు టాలీవుడ్‌లో పర్సంటేజీపై చర్చ..
Tollywood: రామ్ చరణ్ నటించిన భారీ చిత్రం 'పెద్ది' జూన్ 4న విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో, టాలీవుడ్‌లో నిర్మాతలు మరియు ఎగ్జిబిటర్ల మధ్య నెలకొన్న వివాదం ముదిరి పాకాన పడింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సంటేజీ (వాటా) విధానానికి అంగీకరించే సినిమాలను మాత్రమే ప్రదర్శిస్తామంటూ తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పరిణామంపై యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ బుధవారం అత్యవసరంగా మీడియా సమావేశాన్ని నిర్వహించి తమ అసహనాన్ని వ్యక్తం చేసింది. రవిశంకర్ యలమంచిలి, నాగవంశీ, సాహు గారపాటి వంటి ప్రముఖ నిర్మాతలు పాల్గొన్న ఈ సమావేశంలో, పరిశ్రమలోని మూడు కీలక రంగాలు (నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు) పరస్పరం చర్చించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు.
ఈ వివాదంపై నిర్మాత రవిశంకర్ స్పందిస్తూ, తాము ఎగ్జిబిటర్లకు ఏమాత్రం వ్యతిరేకం కాదని, సినిమా అనేది అందరి సామూహిక కష్టమని గుర్తుచేశారు. చిత్ర పరిశ్రమలో ఒక ఎకో సిస్టమ్ ఉందని, ఎగ్జిబిటర్ల ఇబ్బందులను తాము అర్థం చేసుకున్నప్పటికీ, సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని సూచించారు. ఎగ్జిబిటర్ వ్యవస్థలో మార్పులు అవసరమని అంగీకరిస్తూనే, ఇప్పటికిప్పుడు మార్పులు తీసుకురావాలని ఒత్తిడి చేయడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో 'హరిహర వీరమల్లు' విడుదల సమయంలో మొదలైన ఈ పర్సంటేజీ చర్చ, ఇప్పుడు 'పెద్ది' వంటి పెద్ద సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న సమయంలో బ్లాక్‌మెయిల్ చేసే స్థాయికి వెళ్లడం విచారకరమని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేశారు.
నిర్మాత నాగవంశీ ఈ విషయంలో మరింత ఘాటుగా స్పందిస్తూ, ఎగ్జిబిటర్లు కోరుతున్న పర్సంటేజీని ఇవ్వడం నిర్మాతలకు సాధ్యం కాదని స్పష్టం చేశారు. మల్టీప్లెక్స్ అధినేతలే సింగిల్ స్క్రీన్ కష్టాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని, పర్సంటేజీ కావాలని డిమాండ్ చేస్తున్న 23 థియేటర్లు ప్రస్తుతం లీజులోనే ఉండటం హాస్యాస్పదమని ఆయన ఎద్దేవా చేశారు. ఏకపక్ష నిర్ణయాల వల్ల పరిశ్రమకే నష్టం జరుగుతుందని, తక్షణమే అందరూ కలిసి కూర్చుని సామరస్య పూర్వక పరిష్కారాన్ని వెతకాలని గిల్డ్ సభ్యులు డిమాండ్ చేశారు. 'పెద్ది' సినిమా విడుదలపై ఈ వివాదం ప్రభావం చూపే అవకాశం ఉండటంతో, ఇండస్ట్రీలో ఇప్పుడు ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది.