రైతుల ఆదాయం పెంచే దిశగా కేంద్రం కీలక నిర్ణయం..
కేంద్ర ప్రభుత్వానికి మంత్రి అచ్చెన్నాయుడు కృతజ్ఞతలు..
దేశవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి పలు పంటల కనీస మద్దతు ధరలు (MSP) పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం రైతుల ఆదాయాన్ని పెంచడమే కాకుండా వ్యవసాయ రంగానికి మరింత బలం చేకూరుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.
అమరావతిలో స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతాంగ సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతు కష్టానికి తగిన గిట్టుబాటు ధర కల్పించాలన్న లక్ష్యంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఖరీఫ్ పంటల MSP పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షల 60 వేల కోట్ల భారీ వ్యయాన్ని ఆమోదించడం రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.
పంటల ఉత్పత్తి వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడి ఖర్చుపై కనీసం 50 శాతం లాభం వచ్చేలా MSPలను నిర్ణయించడం రైతులకు నిజమైన భరోసా కల్పించే చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎరువులు, విత్తనాలు, కార్మిక ఖర్చులు పెరుగుతున్న సమయంలో ఈ నిర్ణయం రైతులకు ఎంతో ఊరటనిస్తుందని పేర్కొన్నారు.
కేంద్రం ప్రకటించిన కొత్త MSPల ప్రకారం వరి కామన్ రకానికి క్వింటాల్‌కు రూ.72 పెంచి రూ.2441గా నిర్ణయించారు. గ్రేడ్-ఏ వరికి రూ.2461గా ఖరారు చేశారు. అలాగే జొన్నకు రూ.4073, రాగికి రూ.5205, సజ్జలకు రూ.2900, ఉలవలకు రూ.8200, మొక్కజొన్నకు రూ.2410, నువ్వులకు రూ.10,346, సన్‌ఫ్లవర్‌కు రూ.8343, పత్తికి రూ.8667, వేరుశెనగకు రూ.7517 MSPలను ప్రకటించారు.
ఈ ధరల పెంపుతో రైతులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. రైతు సంక్షేమమే దేశ అభివృద్ధికి పునాది అన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని కొనియాడారు.
రాష్ట్రంలోని రైతులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన MSPలను పూర్తిస్థాయిలో పొందేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాలు, మార్కెటింగ్ వ్యవస్థ, మద్దతు ధర అమలు ప్రక్రియలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
వ్యవసాయ రంగాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చారిత్రాత్మక నిర్ణయాలకు రాష్ట్ర రైతుల తరఫున మంత్రి అచ్చెన్నాయుడు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.