ATM Withdrawal Rules 2026: ఏటీఎం రూల్స్ మార్చిన బ్యాంకులు.. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఛార్జీలు, విత్‌డ్రా లిమిట్స్ ఇవే!
ATM Withdrawal Rules 2026: ఏప్రిల్ 1, 2026 నుంచి హెచ్‌డీఎఫ్‌సీ, పీఎన్‌బీ బంధన్ బ్యాంకులు ఏటీఎం నగదు ఉపసంహరణ నియమాలను మార్చాయి. కొత్త ఏటీఎం విత్‌డ్రా పరిమితులు, యూపీఐ క్యాష్ ఛార్జీలు బ్యాంకింగ్ సేవల్లో వచ్చిన మార్పుల పూర్తి వివరాలు.
ATM Withdrawal Rules 2026: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో, బ్యాంకింగ్ రంగంలో సామాన్యులకు షాక్ ఇచ్చేలా పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ (HDFC), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బంధన్ బ్యాంక్ వంటి ప్రముఖ సంస్థలు ఏటీఎం నగదు ఉపసంహరణ పరిమితులు, లావాదేవీల ఛార్జీలపై కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చాయి. ఈ మార్పుల వల్ల ఇకపై ఏటీఎంల నుంచి డబ్బులు తీసేటప్పుడు కస్టమర్లు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది.
ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ, యూపీఐ (UPI) ద్వారా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునే పద్ధతిలో కీలక మార్పు చేసింది. ఇప్పటివరకు చాలామంది కార్డు లేకుండానే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నగదు తీసుకుంటున్నారు. అయితే, ఏప్రిల్ 1 నుంచి ఈ యూపీఐ విత్‌డ్రాయల్స్‌ను కూడా సాధారణ ఏటీఎం లావాదేవీల కోటాలోనే చేర్చారు. ఒకవేళ మీరు నెలకు నిర్దేశించిన ఉచిత పరిమితిని దాటితే, ఆ తర్వాత చేసే ప్రతి యూపీఐ నగదు ఉపసంహరణపై రూ. 23 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే మీరు కార్డు వాడినా, క్యూఆర్ కోడ్ వాడినా ఫ్రీ లిమిట్ దాటితే బాదుడు తప్పదు.
ప్రభుత్వ రంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన ఖాతాదారులకు షాక్ ఇస్తూ డెబిట్ కార్డుల ద్వారా రోజువారీ నగదు తీసుకునే పరిమితిని భారీగా తగ్గించింది. గతంలో కొన్ని కార్డులపై రోజుకు రూ. 1 లక్ష వరకు విత్‌డ్రా చేసుకునే వీలుండగా, ఇప్పుడు దానిని రూ. 50 వేలకు పరిమితం చేసింది. మరికొన్ని ప్రీమియం కార్డులైన రూపే సెలక్ట్, వీసా సిగ్నేచర్ వంటి వాటిపై గతంలో ఉన్న రూ. 1.50 లక్షల పరిమితిని రూ. 75 వేలకు కుదించింది. పెద్ద మొత్తంలో నగదు అవసరమయ్యే ఖాతాదారులు ఈ కొత్త లిమిట్‌ను దృష్టిలో ఉంచుకోవడం అవసరం.
బంధన్ బ్యాంక్ సైతం తన సర్వీస్ ఛార్జీలలో మార్పులు చేసింది. సొంత బ్యాంక్ ఏటీఎంలలో నెలకు 5 సార్లు మాత్రమే ఉచితంగా నగదు తీసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. ఇక మెట్రో నగరాల్లో ఇతర బ్యాంక్ ఏటీఎంలు వాడితే కేవలం 3 లావాదేవీలు మాత్రమే ఉచితం. ఈ పరిమితి దాటిన తర్వాత చేసే ప్రతి ట్రాన్సాక్షన్‌కు రూ. 10 ఛార్జీగా వసూలు చేయనున్నారు. చిన్న మొత్తంలో ఎక్కువ సార్లు డబ్బులు తీసే అలవాటు ఉన్నవారికి ఇది భారంగా మారనుంది.
కేవలం బ్యాంకింగ్ మాత్రమే కాకుండా, ఆదాయపు పన్ను శాఖ కూడా కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. పాన్ కార్డు అప్లికేషన్ సమయంలో ఇకపై మరింత కఠినమైన రూల్స్ ఉండనున్నాయి. అలాగే కొత్త పన్ను విధానం (New Tax Regime) అమలులోకి రావడంతో, ఉద్యోగుల చేతికి వచ్చే జీతం (Take Home Salary) పై కూడా దీని ప్రభావం ఉండవచ్చు. ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు ఈ మార్పులను గమనించుకోకపోతే అదనపు ఛార్జీలు పడే అవకాశం ఉంది.
2026 ఏప్రిల్ నుంచి అమలవుతున్న ఈ కొత్త నిబంధనలు సామాన్య మధ్యతరగతి ప్రజల జేబుకు చిల్లు పెట్టేలా ఉన్నాయి. ముఖ్యంగా డిజిటల్ పేమెంట్స్ పెరుగుతున్న తరుణంలో, నగదు వాడకాన్ని తగ్గించే ఉద్దేశంతోనే బ్యాంకులు ఈ రకమైన కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అందుకే బ్యాంకు లావాదేవీలు చేసే ముందు మీ ఫ్రీ లిమిట్ ఎంత ఉందో సరిచూసుకోవడం మంచిది.
Be the first to react