ATM Rules 2026: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఏటీఎం విత్‌డ్రాయల్స్, యూపీఐ క్యాష్‌పై కొత్త నిబంధనలు ఇవే..!!
ATM Rules 2026: ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానున్న కొత్త ఏటీఎం నిబంధనల గురించి తెలుసుకోండి. HDFC బ్యాంక్ యూపీఐ నగదు విత్‌డ్రాయల్ ఛార్జీలు, PNB డెబిట్ కార్డ్ లిమిట్స్ ఇతర ముఖ్యమైన బ్యాంకింగ్ మార్పుల పూర్తి వివరాలు
ఏటీఎం ఛార్జీల బాదుడు
విత్‌డ్రాయల్ లిమిట్‌లో మార్పులు
డిజిటల్ బ్యాంకింగ్ వైపు అడుగులు
ATM Rules 2026: వచ్చే ఏప్రిల్ 1 నుంచి సామాన్యుల జేబుకు చిల్లు పడనుంది. బ్యాంకింగ్ రంగంలో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ముఖ్యంగా ఏటీఎం విత్‌డ్రాయల్స్, యూపీఐ నగదు లావాదేవీలకు సంబంధించి హెచ్‌డీఎఫ్‌సీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) వంటి దిగ్గజ బ్యాంకులు కొత్త నిబంధనలను అమల్లోకి తెస్తున్నాయి. ఈ మార్పుల వల్ల వినియోగదారులు తమ నగదు ఉపసంహరణల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది.
ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు యూపీఐ (UPI) ద్వారా ఏటీఎంల నుంచి తీసే నగదుకు ప్రత్యేక మినహాయింపులు ఉండేవి. కానీ, ఏప్రిల్ 1 నుంచి యూపీఐ విత్‌డ్రాయల్స్ కూడా నెలవారీ ఉచిత లావాదేవీల పరిమితి కిందకే వస్తాయి. అంటే, మీరు నెలకు పొందే 5 ఉచిత లావాదేవీల్లో యూపీఐ నగదు ఉపసంహరణ కూడా కలిసిపోతుంది. ఈ పరిమితి దాటితే, ప్రతి ట్రాన్సాక్షన్‌కు రూ. 23 చొప్పున అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది దీనికి అదనంగా జీఎస్టీ బాదుడు ఎలాగూ ఉంటుంది.
మరోవైపు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన డెబిట్ కార్డ్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. పెరిగిన సైబర్ నేరాలు, రిస్క్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితిని తగ్గించింది. గతంలో రూ. లక్ష వరకు విత్‌డ్రా చేసుకునే వీలున్న కొన్ని కార్డులపై ఇప్పుడు పరిమితిని రూ. 50,000 నుంచి రూ. 75,000 మధ్యకు కుదించింది. అత్యవసరంగా ఎక్కువ నగదు కావాలనుకునే వారికి ఇది ఇబ్బందికర పరిణామమే.
కేవలం ఛార్జీలు పెంచడమే కాకుండా, టెక్నాలజీని వాడుకోవడంలోనూ బ్యాంకులు ముందుంటున్నాయి. జియో పేమెంట్స్ బ్యాంక్ కొత్తగా 'క్యూఆర్ కోడ్' (QR Code) ఆధారిత నగదు విత్‌డ్రాయల్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. కార్డు లేకుండానే కేవలం స్కాన్ చేసి డబ్బులు తీసుకునేలా బ్యాంకింగ్ కరస్పాండెంట్ పాయింట్ల వద్ద ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. నగదు వినియోగాన్ని తగ్గించి, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా బ్యాంకులు ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి.
కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో, ప్రతి ఒక్కరూ తమ బ్యాంక్ పంపే మెసేజ్‌లను, ఈ-మెయిల్స్‌ను గమనించాలి. మెట్రో నగరాల్లో ఇతర ప్రాంతాల్లో ఉచిత లావాదేవీల సంఖ్య మారుతుంటుంది కాబట్టి, ప్లాన్ చేసుకుని విత్‌డ్రా చేసుకోవడం ఉత్తమం. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ రూల్స్ వల్ల అనవసరపు ఛార్జీలు పడకుండా చూసుకోవడం ముఖ్యం.
Be the first to react