జాతర ఎఫెక్ట్.. విజయనగరం ఎన్నికల తేదీ మార్పు!
AP Muncipal Elections 2026: విజయనగరం నగరపాలక సంస్థ ఎన్నికల షెడ్యూల్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కీలక మార్పు చేసింది. ఈ నెల 28న జరగాల్సిన పోలింగ్‌ను 29వ తేదీకి వాయిదా వేసింది. పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కొత్త షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 29న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
- విజయనగరం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 28 నుంచి 29కు మారింది.
- అక్టోబర్ 30న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది.
AP Muncipal Elections 2026: విజయనగరం నగరపాలక సంస్థ ఎన్నికల షెడ్యూల్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కీలక మార్పు చేసింది. ఈ నెల 28న జరగాల్సిన పోలింగ్‌ను 29వ తేదీకి వాయిదా వేసింది. పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కొత్త షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 29న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
సిరిమాను ఉత్సవం నేపథ్యంలో నిర్ణయం
విజయనగరంలో అక్టోబర్ 26న తొలేళ్ల ఉత్సవం, 27న సిరిమాను ఉత్సవం జరగనున్నాయి. ఈ వేడుకలకు సుమారు 4 నుంచి 5 లక్షల మంది భక్తులు హాజరవుతారని జిల్లా యంత్రాంగం అంచనా వేస్తోంది. దీంతో నగరంలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించాల్సి రావడంతో పాటు, బందోబస్తు కోసం పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బందిని నియమించాల్సి ఉంటుంది.
ఈ పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని జిల్లా అధికారులు ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. రవాణా సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను పరిగణనలోకి తీసుకుని పోలింగ్ తేదీని మార్చాలని విజయనగరం జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ అభ్యర్థనను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్‌ను ఒక రోజు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
అక్టోబర్ 30న ఓట్ల లెక్కింపు
పోలింగ్ తేదీ మారినప్పటికీ ఓట్ల లెక్కింపు షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదు. అక్టోబర్ 30వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అవసరమైతే అదే రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్ నిర్వహించే అవకాశం ఉందని ఎస్ఈసీ తెలిపింది.
రీపోలింగ్ నిర్వహించాల్సి వస్తే, అది పూర్తయ్యే వరకు ఎన్నికల ఫలితాలను ప్రకటించకూడదని జిల్లా ఎన్నికల అధికారిని ఆదేశించింది.
26న సాయంత్రంతో ప్రచారానికి ముగింపు
విజయనగరం నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారం అక్టోబర్ 26వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఇతర పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల మాదిరిగానే ఇక్కడ కూడా ఇదే గడువు వర్తిస్తుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
సిరిమాను ఉత్సవానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా, ఎన్నికలు సజావుగా నిర్వహించాలనే ఉద్దేశంతో పోలింగ్ తేదీని మార్చినట్లు తెలుస్తోంది.
Be the first to react

