పెట్టిన ప్రతి రూపాయికి 60 రెట్ల సంపాదన!

Pattiseema Project: రూ. 1,651 కోట్ల వ్యయంతో కేవలం ఏడాది వ్యవధిలోనే రికార్డు స్థాయిలో నిర్మితమైన పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఇప్పటివరకు 500 టీఎంసీలకు పైగా గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లించింది. కృష్ణా డెల్టాలోని 13 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడమే కాకుండా శ్రీశైలంలో ఆదా అయిన నీటితో రాయలసీమ దాహార్తిని తీర్చింది. వ్యవసాయం, ఆక్వా రంగాల ద్వారా ఏకంగా లక్ష కోట్ల రూపాయల సంపదను సృష్టించి, పెట్టిన ప్రతి రూపాయికి 60 రెట్ల రాబడితో విమర్శలను పటాపంచలు చేసింది.

లక్ష కోట్ల సిరులు కురిపించిన పట్టిసీమ
లక్ష కోట్ల సిరులు కురిపించిన పట్టిసీమ
  • సముద్రం పాలయ్యే గోదావరి వరద జలాలను ఒడిసిపట్టే వరప్రదాయినిగా! నదుల అనుసంధానంతో సరికొత్త చరిత్ర!

  • కేవలం ఏడాది వ్యవధిలోనే రికార్డు నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న అద్భుతంగా! లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పట్టిసీమ ఘనత!

  • కృష్ణా డెల్టాలో 13 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించే రక్షణ కవచంగా! అన్నదాతల కళ్లల్లో జలసిరుల ఆనందం!

Rayalaseema: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ, సాగునీటి చరిత్రలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది. ఏటా సముద్రంలో వృథాగా కలిసిపోతున్న గోదావరి వరద జలాలను ఒడిసిపట్టి, కృష్ణా డెల్టాకు మళ్లించడం ద్వారా కరవును శాశ్వతంగా పారద్రోలాలన్న నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన క్షేత్రస్థాయిలో అద్భుత ఫలితాలనిచ్చింది. కేవలం రూ. 1,651 కోట్ల ప్రాథమిక వ్యయంతో చేపట్టిన ఈ పథకం, పెట్టిన ప్రతి రూపాయికి 60 రెట్లకు పైగా రాబడిని అందిస్తూ రాష్ట్రానికి దాదాపు లక్ష కోట్ల రూపాయల అపారమైన సంపదను సృష్టించి చరిత్ర సృష్టించింది.

రికార్డు సమయంలో పూర్తి – లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు

దశాబ్దాల తరబడి కొనసాగే భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలకు భిన్నంగా పట్టిసీమ సరికొత్త రికార్డును నెలకొల్పింది. 2015 జూలైలో ప్రాజెక్టు పనులను ప్రారంభించి, అహర్నిశలు శ్రమించి కేవలం ఏడాది కాలంలోనే అంటే మార్చి 2016 నాటికి పనులను పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. ఇంత తక్కువ సమయంలో ఒక భారీ ఎత్తిపోతల పథకాన్ని విజయవంతంగా నిర్మించి నీటిని ఎత్తిపోయడంతో పట్టిసీమ ప్రతిష్టాత్మక 'లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్'లో సముచిత స్థానం దక్కించుకుని దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.

కృష్ణా డెల్టా స్థిరీకరణ – రాయలసీమకు జలవరప్రసాదం

ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు ప్రకాశం బ్యారేజీకి చేరడంతో కృష్ణా డెల్టా పరిధిలోని సుమారు 13 లక్షల ఎకరాల ఆయకట్టు సంపూర్ణంగా స్థిరీకరణ చెందింది. రైతులు ముందస్తు ఖరీఫ్ సాగు చేపట్టడంతో పాటు ఆక్వా రైతులకు నీటి కొరత లేకుండా పోయింది. అలాగే కృష్ణా డెల్టా అవసరాలు గోదావరి నీటితో తీరడంతో ఎగువన ఉన్న శ్రీశైలం రిజర్వాయర్‌లో కృష్ణా జలాలు ఆదా అయ్యాయి. అలా ఆదా అయిన జలాలను పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్, హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుల ద్వారా రాయలసీమ కరవు ప్రాంతాలకు మళ్లించి తాగు, సాగునీటి అవసరాలను సమర్థవంతంగా తీర్చగలిగారు.

500 టీఎంసీలకు పైగా జలాల మళ్లింపు – కరవు కాలంలో కంటికి రెప్పలా రక్షణ

గత దశాబ్ద కాలపు ప్రయాణాన్ని పరిశీలిస్తే ఈ ప్రాజెక్టు ద్వారా ఏకంగా 500 టీఎంసీలకు పైగా గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు విజయవంతంగా మళ్లించారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు, తీవ్రమైన ఎల్‌నినో కరవు సమయంలోనూ డెల్టా పంటలు ఎండిపోకుండా పట్టిసీమ కాపాడింది. 2017లో 105.80 టీఎంసీలు, 2018లో 96.94 టీఎంసీలు, 2023లో 58.72 టీఎంసీలు, 2026లో 57.70 టీఎంసీల మేర వరద జలాలను ఒడిసిపట్టి అన్నదాతలకు సంపూర్ణ భరోసాగా నిలిచింది.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతం – వ్యవసాయం, ఆక్వా రంగానికి మేలు

ఈ పథకం ద్వారా కేవలం పంటలకే కాకుండా రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తికి (GSDP) భారీ చేయూత లభించింది. సాగునీటి సంఘాల లెక్కల ప్రకారం.. పట్టిసీమ నీటి వినియోగం ద్వారా వ్యవసాయ రంగంలో దాదాపు రూ. 26,775 కోట్ల పంట సంపద చేకూరగా, తీరప్రాంత ఆక్వా రంగంలో ఏకంగా రూ. 78,000 కోట్ల విలువైన ఉత్పత్తులు సాధ్యమయ్యాయి. వెరసి దాదాపు లక్ష కోట్ల రూపాయల సంపద రాష్ట్ర ప్రజలకు, రైతులకు ప్రత్యక్షంగా సమకూరింది.

విమర్శలను పటాపంచలు చేసిన జలవిజయం

ప్రారంభంలో ఈ ప్రాజెక్టును ‘వట్టిసీమ’ అంటూ రాజకీయ ప్రత్యర్థులు తీవ్రంగా విమర్శించారు. ఆ తర్వాత పాలనలో ప్రాజెక్టు నిర్వహణపై కొంత నిర్లక్ష్యం కనిపించినప్పటికీ, పట్టిసీమ అందించిన క్షేత్రస్థాయి ఫలితాలు ఆ విమర్శలన్నింటినీ కొట్టుకుపోయేలా చేశాయి. సముద్రంలో కలిసిపోయే నీటిని ఒడిసిపట్టి సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఎంతటి అపారమైన ప్రయోజనం కలుగుతుందో పట్టిసీమ దేశానికే నిరూపించింది.

Tags

Be the first to react

Latest