పరిపాలనలో ఖచ్చితత్వం, సమన్వయం పెంచుకోవాలని సూచన..
ఈసారి సింగపూర్ పర్యటన చాలా ప్రత్యేకమైంది..
అమరావతి: 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో మంత్రి అనగాని సత్యప్రసాద్ సింగపూర్ పర్యటనలో పొందిన అనుభవాలను పంచుకున్నారు. ఈసారి సింగపూర్ పర్యటన ఎంతో ప్రత్యేకమైందని, పరిపాలనకు సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల రూపంలో భారీ పరిపాలనా వ్యవస్థ ఉన్నప్పటికీ, సింగపూర్ మాత్రం పనులను అత్యంత ఖచ్చితత్వంతో, సమన్వయంతో నిర్వహించడంలో ముందుందని మంత్రి పేర్కొన్నారు. మన రాష్ట్రంలో ఉన్న విస్తృత వ్యవస్థను సింగపూర్ తరహా ఖచ్చితత్వంతో కలిపి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 500 రకాల సేవలు అందిస్తున్నప్పటికీ, అవన్నీ ఒకే చోట సులభంగా అందేలా చేయడంలో ఇంకా మెరుగుదల అవసరమని సూచించారు. సింగపూర్ మాదిరిగా ప్రజలకు అన్ని సేవలు ఒకే వేదికపై అందుబాటులోకి రావాలని ఆయన అభిప్రాయపడ్డారు.
అలాగే, రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న ఆర్టీజీఎస్, మీ భూమి, సింగిల్ డెస్క్ వంటి బలమైన వ్యవస్థలను పరస్పరం అనుసంధానించి మరింత సమర్థవంతంగా పనిచేయించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి చెప్పారు.
పరిశ్రమల విషయంలో కూడా సింగపూర్ విధానాన్ని ఉదాహరణగా తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం వేగంగా అనుమతులు ఇస్తున్నప్పటికీ, సింగపూర్ లాగా పరిశ్రమలు రాకముందే భూమి, మౌళిక వసతులు సిద్ధంగా ఉంచే విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలు, జిల్లా పరిపాలన బలంగా ఉన్నప్పటికీ, అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేసేలా వ్యవస్థను మరింత మెరుగుపరచాలని మంత్రి సూచించారు. సింగపూర్‌లో చూసిన సమర్థవంతమైన పరిపాలన పద్ధతులను ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తే ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించవచ్చని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.