Politics- రాజధానిపై వైసీపీకి క్లారిటీ లేదు.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు!
మాట తప్పడం, మడమ తిప్పడం వైసీపీ నైజం: మంత్రి ధ్వజం
రైతులను బూటు కాళ్లతో తన్నించిన చరిత్ర మీది.. ఇప్పటికైనా మారండి
Minister Narayana: ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నెల్లూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అమరావతి రాజధాని విషయంలో వైసీపీ నేతలకు అసలు క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు. జగన్ మోహన్ రెడ్డి అమరావతిపై విషం కక్కుతున్నారని, రివర్ బెడ్ కు, రివర్ బేసిన్ కు తేడా తెలియకుండా వారి నాయకుడు మాట్లాడుతుంటే, కింద ఉన్న నేతలు ఒక్కొక్కరు ఒకలా స్టేట్‌మెంట్లు ఇస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని విమర్శించారు. రాజధానిపై వైసీపీ తన స్పష్టమైన వైఖరిని ఇప్పటికైనా బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
అమరావతికి చట్టబద్ధత కల్పించాలని రైతులు కోరుతున్నారని, అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంతో చర్చించి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారని మంత్రి గుర్తుచేశారు. గతంలో రాజధాని కోసం 30 వేల ఎకరాలు కావాలని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్, అధికారంలోకి రాగానే మాట మార్చి 'మూడు ముక్కలాట' ఆడారని ధ్వజమెత్తారు. రాజధాని కోసం 34,400 ఎకరాలు ఇచ్చిన రైతులను కంచెలు వేసి బంధించారని, ఆడవాళ్లని బూటు కాళ్లతో తొక్కించి అక్రమ కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ తీరు చూస్తుంటే వారి రాజకీయ ఉనికి త్వరలోనే ప్రశ్నార్థకం అవుతుందని హెచ్చరించారు.
వైసీపీ నేతలు మాట మీద నిలబడే తత్త్వం లేనివారని మరోసారి నిరూపించుకున్నారని నారాయణ విమర్శించారు. ప్రస్తుతం అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతుంటే ఓర్వలేక విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలందరూ అమరావతి అభివృద్ధిని కోరుకుంటున్నారని, కానీ వైసీపీ నేతలు మాత్రం ఇంకా పాత కక్షలతోనే రాజకీయాలు చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా అమరావతిని నిలబెట్టడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని మంత్రి హెచ్చరించారు. అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, కానీ తమ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గకుండా పనులను పూర్తి చేస్తుందని చెప్పారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు బుద్ధి తెచ్చుకుని రాజధానిపై తమ నిర్ణయం ఏంటో సూటిగా చెప్పాలని, లేనిపక్షంలో గత ఎన్నికల్లో వచ్చిన 11 సీట్లు కాస్తా సున్నాకు పడిపోవడం ఖాయమని మంత్రి నారాయణ ఘాటుగా హెచ్చరించారు.