- AP Shivaratri power supply: శివరాత్రికి నిరంతర సరఫరా
- డిస్కమ్‌లకు మంత్రి ఆదేశాలు
- 24 గంటల మెయింటెనెన్స్ బృందాలు
మహా శివరాత్రి (Maha Shivaratri) పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాలు పరిసర ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో ఏ విధమైన అంతరాయం లేకుండా నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravikumar) ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో పని చేయాలని ఆయన స్పష్టం చేశారు.
నేడు డిస్కమ్‌ల సీఎండీలు ఎల్.శివశంకర్, ఐ.పృధ్వీ తేజ్, పి.పుల్లారెడ్డి లతో పాటు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. శివరాత్రి పండుగను (AP Shivaratri power supply) దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సరఫరా సన్నద్ధతపై ఆయన సమీక్షించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ప్రధాన శివాలయాలు ఇతర దేవాలయాలకు వెళ్లే అవకాశం ఉన్నందున, నిరంతర విద్యుత్ సరఫరా అత్యంత అవసరం అని మంత్రి పేర్కొన్నారు. భక్తుల సౌకర్యం కోసం ధార్మిక కార్యక్రమాలు అంతరాయం లేకుండా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు.
పండుగ రోజుల్లో విద్యుత్ అంతరాయాలు లేకుండా ఉండేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. అవసరమైతే ప్రత్యామ్న్యాయ విద్యుత్ అందించేలా ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించేందుకు 24 గంటల మెయింటెనెన్స్ బృందాలు సిద్ధంగా ఉండాలని సూచించారు. అనుకోని సమస్యలు తలెత్తకుండా ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ పంపిణీ లైన్లపై ముందస్తు తనిఖీలు నిర్వహించాలని ఆయన సూచించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా తక్షణ పునరుద్ధరణ చర్యలు చేపట్టేలా సిద్ధంగా ఉండాలని, ఫీల్డ్ అధికారులందరూ అలర్ట్ గా ఉండి కచ్చితమైన పర్యవేక్షణ కొనసాగించాలని మంత్రి ఆదేశించారు.
ఎటువంటి అంతరాయం లేకుండా ఉండేలా చూడటం ముఖ్యమని అత్యవసర పరిస్థితుల్లో తక్షణ పునరుద్ధరణ చర్యలు చేపట్టేలా ఫీల్డ్ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. మహా శివరాత్రి సందర్భంగా భక్తులు భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకునేలా ప్రతి డిస్కమ్ సమర్థవంతంగా పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు.