సంక్రాంతి పండుగ వేళ ప్రజల ఆనందాన్ని మరింత పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుస శుభవార్తలు ప్రకటిస్తోంది. ఇప్పటికే విద్యుత్ ఛార్జీల తగ్గింపు, కొత్త అన్న క్యాంటీన్ల ప్రారంభం వంటి కీలక నిర్ణయాలతో ప్రజలకు ఊరట కలిగించిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు మరో కొత్త సంక్షేమ పథకానికి సిద్ధమవుతోంది. ప్రజలకు ప్రత్యక్ష లాభం చేకూర్చేలా కొత్త స్కీమ్స్‌ను ప్రారంభించడంతో పాటు, గతంలో నిలిచిపోయిన పథకాలను మళ్లీ పునరుద్ధరించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో అమల్లోకి రానున్న ‘గరుడ పథకం’పై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాల అకౌంట్లలోకి నేరుగా రూ.10 వేలు జమ చేయనున్నట్లు స్పష్టం చేసింది.
రాష్ట్రంలోని పేద బ్రాహ్మణ కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ‘గరుడ’ పథకాన్ని కొత్తగా ప్రారంభించనుంది. ఈ పథకం ప్రధాన ఉద్దేశం కష్టకాలంలో బ్రాహ్మణ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే. బ్రాహ్మణ కుటుంబంలో ఎవరైనా వ్యక్తి మరణించిన సందర్భంలో, ఆ కుటుంబానికి ప్రభుత్వం రూ.10 వేల ఆర్థిక సహాయం అందించనుంది. ఈ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. అనుకోని విషాద సమయంలో కనీస ఆర్థిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే ఈ పథకం అమలుకు సంబంధించిన కార్యాచరణ కూడా ప్రారంభమైంది.
ఇటీవల అమరావతిలోని సచివాలయంలో గరుడ పథకం అమలుపై కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి సవితతో పాటు బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చిరాంప్రసాద్ పాల్గొని పథకం విధివిధానాలు, అమలు ప్రక్రియపై సుదీర్ఘంగా చర్చించారు. అర్హత ప్రమాణాలు, దరఖాస్తు విధానం, సహాయం అందించే విధానం వంటి అంశాలపై స్పష్టత తీసుకొచ్చారు. గరుడ పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను త్వరలోనే ప్రభుత్వం విడుదల చేయనుందని అధికారులు వెల్లడించారు. మార్గదర్శకాలు వెలువడిన వెంటనే పథకం అమలులోకి రానుందని తెలిపారు.
2014లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ కార్పొరేషన్ ద్వారా గాయత్రి, వేదవ్యాస, వశిష్ట, ద్రోణాచార్య, చాణక్య, కల్యాణ మస్తు, కశ్యప, భారతి, భారతి విదేశీ విద్య వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాయి. అయితే గత కొన్నేళ్లుగా ఈ పథకాలు నిలిచిపోయాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాటన్నింటినీ మళ్లీ పునరుద్ధరించేందుకు సిద్ధమవుతోంది. బ్రాహ్మణులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, సంక్షేమమే లక్ష్యంగా పాలన కొనసాగిస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు.