కనుమ పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో కీలక అభివృద్ధి ప్రాజెక్ట్ దక్కబోతోంది. రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం మరో భారీ అడుగు వేస్తోంది. కాకినాడ కేంద్రంగా ఏర్పాటు కానున్న గ్రీన్ అమోనియా మెగా ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు రూ.13 వేల కోట్ల పెట్టుబడులతో ప్రారంభమవుతున్న ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలవనుంది. క్లీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో ముందంజలో నిలిపేలా ఈ పరిశ్రమ కీలక పాత్ర పోషించనుంది.
ప్రపంచం మొత్తం ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ, కార్బన్ ఉద్గారాల తగ్గింపు దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా వంటి ప్రత్యామ్నాయ ఇంధనాల ప్రాధాన్యం రోజు రోజుకు పెరుగుతోంది. అదే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుచూపుతో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రీన్కో గ్రూప్‌కు చెందిన ఏఎమ్ గ్రీన్ సంస్థకు గత ఏడాది అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం, ఏడాదిలోనే ఈ ప్రాజెక్టును కార్యరూపం దాల్చే స్థాయికి తీసుకొచ్చింది. ఏడాదికి ఒక మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి లక్ష్యంగా ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
శనివారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి కాకినాడకు చేరుకుని ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. శంకుస్థాపన అనంతరం సీఎం ప్రాజెక్ట్ ప్రాధాన్యత, రాష్ట్ర భవిష్యత్తులో క్లీన్ ఎనర్జీ పాత్రపై ప్రసంగించనున్నారు. రాష్ట్రానికి ఇంత పెద్ద స్థాయిలో పెట్టుబడులు రావడం పట్ల ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేస్తోంది.
ఈ గ్రీన్ అమోనియా ప్లాంట్ పూర్తిగా పునరుత్పాదక శక్తిని ఉపయోగించి పనిచేయనుంది. బొగ్గు, చమురు, సహజ వాయువులతో తయారయ్యే సంప్రదాయ అమోనియాతో పోలిస్తే ఇది పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించదు. కార్బన్ ఉద్గారాలు పూర్తిగా లేని విధంగా ఉత్పత్తి జరగనుంది. దీంతో నెట్-జీరో ఎమిషన్స్ లక్ష్యాలను చేరుకునే దిశగా దేశానికి ఇది ఒక ఆదర్శ ప్రాజెక్ట్‌గా నిలవనుంది.
కాకినాడలో ఉన్న నాగార్జున ఫెర్టిలైజర్స్ పాత గ్రే అమోనియా ప్లాంట్‌ను ఆధునీకరించి గ్రీన్ అమోనియా ప్లాంట్‌గా మార్చుతున్నారు. దాదాపు 495 ఎకరాల విస్తీర్ణంలో ఈ పరిశ్రమ ఏర్పాటవుతోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 2,600 మంది యువతకు ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అలాగే అనుబంధ రంగాల్లో మరిన్ని ఉపాధి అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది. 2027 చివరి నాటికి ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో పనులు చేపట్టనున్నారు.
ఈ ప్లాంట్ కాకినాడ పోర్ట్‌కు చాలా సమీపంలో ఉండటం మరో ప్రధాన లాభం. గ్రీన్ అమోనియాను విదేశాలకు ఎగుమతి చేయడానికి ఇది అనుకూలంగా మారనుంది. ఇప్పటికే జర్మనీకి చెందిన యూనిపర్ సంస్థతో ఏఎమ్ గ్రీన్ ఒప్పందం కుదుర్చుకుంది. 2028 నుంచి జర్మనీకి గ్రీన్ అమోనియా ఎగుమతులు ప్రారంభం కానున్నాయి. అలాగే మలేషియా, సింగపూర్, యూఏఈ వంటి దేశాలకు చెందిన అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందనుంది.
ఈ ప్రాజెక్టుతో పాటు కాకినాడలోనే రూ.2,000 కోట్ల వ్యయంతో ఎలక్ట్రోలైజర్ తయారీ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేయాలని ఏఎమ్ గ్రీన్ నిర్ణయించింది. మొత్తం మీద ఈ గ్రీన్ అమోనియా మెగా ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్లీన్ ఎనర్జీ రంగంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.