అమెరికా దళాలకు సహకరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ పొరుగు దేశాలకు కఠిన హెచ్చరిక జారీ చేసింది. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ, నిరసనకారులకు మద్దతు ఇస్తున్న అమెరికా చర్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. అమెరికా తమపై సైనిక దాడికి పాల్పడితే, అంతకంటే తీవ్ర స్థాయిలో ప్రతిదాడులు చేస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ హెచ్చరికతో మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
అమెరికా చేపట్టే సైనిక చర్యలకు ఏ దేశమైనా సహకరిస్తే, ఆ దేశాల్లో ఉన్న అమెరికా లేదా మిత్రదేశాల సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణి దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇది కేవలం హెచ్చరిక మాత్రమే కాదని, తమ వద్ద పూర్తి స్థాయి రక్షణ, దాడి సామర్థ్యం ఉందని ఇరాన్ అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రకటన పొరుగు దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఇరాన్ సమీప ప్రాంతాల్లో అమెరికా అత్యాధునిక డ్రోన్లతో నిఘా వ్యవస్థను బలోపేతం చేయడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఎప్పుడైనా ఇరాన్‌పై దాడి జరిగే అవకాశం ఉందన్న సంకేతాలతో ఆ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా వెనక్కి తగ్గకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇరాన్ పదే పదే హెచ్చరిస్తోంది.
ఇదిలా ఉండగా, గత కొంతకాలంగా వెనిజువెలా పరిణామాలపై దృష్టి సారించిన అమెరికా, ఇప్పుడు తన వ్యూహాత్మక దళాలను మళ్లీ గల్ఫ్ ప్రాంతం వైపు మళ్లించినట్లు సమాచారం. ఒమన్ గల్ఫ్‌తో పాటు ఇరాన్ సరిహద్దు ప్రాంతాల్లో అమెరికా నిఘా చర్యలు గణనీయంగా పెరిగాయి. ఇది రాబోయే సైనిక చర్యలకు ముందస్తు ఏర్పాట్లేనని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ ఏడాది ప్రారంభం నుంచే అమెరికా నావికాదళానికి చెందిన ఎంక్యూ–4సీ ట్రైటాన్ డ్రోన్లు అబుదాబిని కేంద్రంగా చేసుకుని నిరంతర నిఘా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ డ్రోన్లు సముద్ర, భూభాగ కదలికలను అత్యంత ఖచ్చితంగా పర్యవేక్షించగలవు. ఈ పరిణామాలన్నీ మధ్యప్రాచ్యంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతున్నదనే సంకేతాలను ఇస్తున్నాయి.