సంక్రాంతి కానుకగా విజయవాడ వెస్ట్ బైపాస్‌లో ఒకవైపు రహదారిని (మంగళగిరి మండలం కాజా నుంచి పెదఅవుటపల్లి వరకు) అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారులు శాస్త్రోక్తంగా పూజలు చేసి, మొదట అధికారుల వాహనాలను, ఆ తర్వాత ప్రజల వాహనాలను అనుమతించారు. ప్రస్తుతం అన్ని రకాల వాహనాలను రహదారిపై అనుమతిస్తున్నారు.
ఈ బైపాస్ నేషనల్ హైవే-16 (చెన్నై-కోల్‌కతా)ని నేషనల్ హైవే-65 (విజయవాడ-హైదరాబాద్)తో అనుసంధించే ముఖ్యమైన ప్రాజెక్ట్. దీని వల్ల విజయవాడ నగరంలోకి రాకుండానే గుంటూరు నుంచి వచ్చే వాహనాలు నేరుగా రాజధాని (అమరావతి) లేదా హైదరాబాద్, ఏలూరు వైపు వెళ్లవచ్చు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ... మార్చి నాటికి రెండోవైపు రహదారిని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. పూర్తి స్థాయిలో రహదారి అందుబాటులోకి వచ్చిన తర్వాత వెంకటపాలెం దగ్గర టోల్ ఫీజు వసూలు చేస్తామని వెల్లడించారు.
ఈ రహదారి దాదాపు 48 కి.మీ. పొడవు ఉంది. ఆరు లేన్లతో నిర్మితమవుతోంది. ఈ రహదారితో విజయవాడ నగర ట్రాఫిక్ సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం లభించనుంది.