మెగాస్టార్ చిరంజీవి అంటేనే ఒక ప్రభంజనం. ఆయనకు తోడుగా సక్సెస్ మెషిన్ అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేశ్ కూడా తోడైతే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. సరిగ్గా ఇదే జరిగింది.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ. 150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి, ఈ ఏడాది మొదటి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
సినిమా భారీ విజయం సాధించిన సందర్భంగా చిత్ర యూనిట్ నిర్వహించిన 'సక్సెస్ ఇంటర్వ్యూ' ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులోని ఆసక్తికర విశేషాలు మీకోసం.
ఈ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల పాల్గొన్నారు. షూటింగ్ సమయంలోనే కాదు, ఇంటర్వ్యూలో కూడా చిరంజీవి తనలోని ఆతిథ్య గుణాన్ని చాటుకున్నారు. స్వయంగా తాను వండిన కొన్ని వంటకాలను అందరికీ వడ్డించి ఆశ్చర్యపరిచారు.
అందరూ తింటుంటే చిరంజీవి మాత్రం దూరంగా ఉన్నారు. "మీరు కూడా తినండి అన్నయ్యా" అని వెంకటేశ్ కోరగా.. డైట్ చేస్తున్నానని చిరు చెప్పారు. దీనికి వెంకీ స్పందిస్తూ.. "నువ్వు ఇలాగే డైట్ చేసి, బాగా సన్నబడి సినిమాలో నన్ను డామినేట్ చేశావ్" అని సరదాగా వ్యాఖ్యానించారు. దీనికి చిరు తనదైన శైలిలో స్పందిస్తూ.. "పొట్టకూటి కోసం పొట్ట మాడ్చుకుంటున్నాను భయ్యా.. అందరికీ అన్నీ తినే అదృష్టం ఉండదు" అని చమత్కరించడంతో అక్కడ నవ్వులు విరిబూశాయి.
ఈ సినిమాలో మెగాస్టార్ పాత సినిమాల్లోని మేనరిజమ్స్, కామెడీ టైమింగ్‌ను అనిల్ రావిపూడి అద్భుతంగా వాడుకున్నారు. గతంలో చిరు ఒక వేదికపై చెప్పిన "ఇందువదన.. వావ్!" అనే డైలాగ్ సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయింది. అదే డైలాగ్‌ను సినిమాలో పులిని చూసిన సందర్భంలో వాడి అందరినీ నవ్వుల్లో ముంచెత్తారు.
సాంగ్ లో వచ్చే 'వీణ స్టెప్' ఐడియా మెగాస్టార్ దేనని అనిల్ రావిపూడి వెల్లడించారు. ఎటువంటి రిహార్సల్స్ లేకుండా సింగిల్ టేక్ లో ఆ స్టెప్ వేసి అందరినీ అవాక్కయ్యేలా చేశారని ఆయన కొనియాడారు.
ఇంటర్వ్యూ చివరలో చిరంజీవి ఒక సంచలన ప్రకటన చేశారు. అనిల్ రావిపూడికి బంపర్ ఆఫర్ ఇస్తూ.. "నాకు, వెంకటేశ్‌కి కలిపి ఒక మంచి మల్టీస్టారర్ కథ సిద్ధం చెయ్, మేమిద్దరం కలిసి ఫుల్ లెంగ్త్ సినిమా చేయడానికి సిద్ధం" అని చెప్పారు. ఒకవేళ వెంకీ సినిమాలో తనకు గెస్ట్ రోల్ ఇచ్చినా సరే నటించడానికి అభ్యంతరం లేదని తన పెద్ద మనసును చాటుకున్నారు.